● పనుకుమడుకు గిరిజనగూడెం ప్రజలకు నీటి కష్టాలు ● వెలిగండ్ల ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ నుంచి నీరు తెచ్చుకుంటూ అవస్థలు
పెద్దదోర్నాల: మండల పరిధిలోని పనుకుమడుగు గిరిజనగూడెంలో నీటి కష్టాలు అక్కడి గిరిజనులను ప్రమాదాలబాట పట్టిస్తున్నాయి. గిరిజనులకు తాగునీటి సౌకర్యం కల్పించడంలో అధికారుల అలసత్వం, ఆ కష్టజీవులను ప్రమాదకర మార్గాల వైపునకు మళ్లిస్తోంది. గిరిజనగూడెంలో ఉన్న డీప్ బోరు మరమ్మతులకు గురవుతుండటంతో ఆ విషయాన్ని అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఎంపీడీఓ విజయ ఆదేశాల మేరకు పనుకుమడుగు గిరిజనగూడేనికి రెండు రోజులుగా ట్యాంకర్ల ద్వారా పంచాయతీ కార్యదర్శి నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఆ నీరు ఉప్పగా ఉండటంతో తాగలేకపోతున్నామని, గత్యంతరం లేని పరిస్థితుల్లో గూడెం సమీపం నుంచి వెళ్తున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లోని నీటిని ప్రమాదమని తెలిసినా తెచ్చుకుంటున్నామని గిరిజనులు తెలిపారు. ఇటీవలే సరదాగా ఈత కోసం ఫీడర్ కెనాల్‌లోని నీటిలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన మరవకముందే నీటి కోసం బిందెలతో ఫీడర్ కెనాల్ లైనింగ్‌పై నడిచి గిరిజనులు ప్రాణాలతో చెలగాటమాడటం అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు స్పందించి గిరిజనగూడెంలో మరమ్మతులకు గురైన డీప్‌బోరును బాగుచేసి తమకు తాగునీరు సరఫరా చేయాలని గిరిజనులు కోరుతున్నారు.


