దాహాకారం! | - | Sakshi
Sakshi News home page

దాహాకారం!

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

మార్కాపురం..

దూపాడు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లోకి చేరుతున్న నీరు

మార్కాపురం టౌన్‌:

ట్టణ ప్రజలకు దాహార్తి కష్టాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చుక్క నీటి కోసం బిందెలు పట్టుకుని గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పట్టణంలో తాగునీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. లక్షకు పైగా ఉన్న జనాభా దాహార్తిని తీర్చాల్సిన మున్సిపాలిటీ.. నీటి నిల్వలు లేక నాలుగు రోజులకోసారి మాత్రమే అరకొరగా సరఫరా చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

70 రోజులు పారితేనే గట్టెక్కేది!

పట్టణ తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారమైన దూపాడు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు పూర్తి సామర్థ్యం 2,200 మిలియన్‌ లీటర్లు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 800 మిలియన్‌ లీటర్ల నిల్వ మాత్రమే ఉంది. ఇటీవల సాగర్‌ కాలువకు మంచినీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయడంతో ఎస్‌ఎస్‌ ట్యాంకును నింపే ప్రక్రియ ప్రారంభించారు. అయితే, ఎస్‌ఎస్‌ ట్యాంకు పూర్తిస్థాయిలో నిండాలంటే సాగర్‌ కాలువ ద్వారా కనీసం 70 రోజుల పాటు నిరంతరాయంగా నీరు పారాల్సి ఉంటుంది. అధికారులు ముందస్తు ప్రణాళికతో పూర్తి నిల్వలను సమకూర్చుకోకపోతే రానున్న రోజుల్లో పట్టణానికి నీటి గండం తప్పదు.

వట్టిపోయిన బోర్లు.. అందని ట్యాంకర్లు

నిబంధనల ప్రకారం సగటున మనిషికి రోజుకు 135 లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం 35 వార్డుల్లోని 12,500 కుళాయిలకు తర్లుపాడు రోడ్డు, పీఎస్‌ కాలనీ, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జవహర్‌నగర్‌ కాలనీ, డ్రైవర్స్‌ కాలనీల్లోని 5 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా సాగర్‌ నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే పైపులైన్లు లేని ప్రాంతాలు, శివారు కాలనీలు పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడ్డాయి. వర్షాల్లేక పట్టణ పరిధిలోని 180 డీప్‌బోర్లలో ఎక్కువ భాగం రీచార్జ్‌ కాక వట్టిపోయాయి. కొన్ని బోర్లు మరమ్మతులకు గురయ్యాయి. శివారు కాలనీల దాహం తీర్చేందుకు మున్సిపాలిటీకి చెందిన రెండు ట్యాంకర్లు ఏమాత్రం సరిపోవడం లేదు. అధికారులు వెంటనే స్పందించి సాగర్‌ నీటిని పూర్తిస్థాయిలో ఎస్‌ఎస్‌ ట్యాంకుకు చేర్చడంతో పాటు, ట్యాంకర్ల ట్రిప్పులు పెంచి శివారు కాలనీల దాహార్తిని తీర్చాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

2,200 ఎంఎల్‌ సామర్థ్యమున్న దూపాడు ఎస్‌ఎస్‌ ట్యాంకులో 800 మిలియన్‌ లీటర్లే నిల్వ

ఎస్‌ఎస్‌ ట్యాంకు నిండాలంటే 70 రోజుల పాటు కాలువలో నీరు పారాలి!

మార్కాపురంలోని 180 డీప్‌బోర్లలో పదుల సంఖ్యలో మరమ్మతులు..

పట్టణ వాసులకు నాలుగు రోజులకోసారే నీటి సరఫరా

శివారు కాలనీల్లో ప్రజలకు తాగునీటి కోసం తప్పని తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement