టీడీపీకి చుక్కెదురు.. | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి చుక్కెదురు..

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

కొరిశపాడు మండలం తమ్మవరంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిన 25 కుటుంబాలు పార్టీ కండువాలు వేసి స్వాగతించిన వైఎస్సార్‌ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ కూటమి పాలనలో అన్ని రంగాలు కుంటుపడ్డాయని విమర్శ

మేదరమెట్ల: కొరిశపాడు మండలంలో టీడీపీకి చుక్కెదురైంది. మండల పరిధిలోని తమ్మవరంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు పోతుల వెంకటస్వామి, మాజీ సర్పంచ్‌ రామిరెడ్డి అంజయ్య ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న సుమారు 25 కుటుంబాల వారు గురువారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆయన పలకరించారు. వారి యోగక్షేమాలడిగి తెలసుకున్నారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

గెలుపు సరే.. అభివృద్ధి ఎక్కడ..?

ఈ సందర్భంగా చింతలపూడి అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో వరుస గెలుపు అంటారు.. గెలుపు సరే.. అభివృద్ధి ఎక్కడని ప్రశ్నించారు. కూటమి పాలనలో అన్నిరంగాలు కుంటుపడ్డాయని మండిపడ్డారు. అద్దంకి నియోజకవర్గంలో వ్యవసాయ రంగం కుదేలవుతున్నా పట్టించుకున్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకిలో గుడ్‌ మార్నింగ్‌ పేరుతో చేపట్టిన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలసుకుంటూ వారితో మమేకమవుతున్న విధానాన్ని వివరించారు. దాన్ని చూసి కొంత చలనం వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. పింఛన్లు పొందేందుకు అర్హత ఉన్న దరఖాస్తుదారులకు కూడా టీడీపీ నాయకుల సంతకాలు, సిఫార్సులు కావాలా అని ప్రశ్నించారు. ప్రజలకు తాము నిరంతరం అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. అదే అంతిమ లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని అశోక్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ముందుగా తమ్మవరం గ్రామంలో శ్రీకృష్ణ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులతో మాట్లాడారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా ఎస్సీకాలనీకి చేరుకున్నారు. అక్కడ 25 కుటుంబాల వారు టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు చింతలపూడి అశోక్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి కోయి అంకారావు, ఆర్టీఐ వింగ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్తవరపు రమణయ్య చౌదరి, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గోలి రమణబాబు, పంచాయతీరాజ్‌ వింగ్‌ అధ్యక్షుడు అంజిరెడ్డి, కొరిశపాడు మండల అధ్యక్షుడు పాలపర్తి శ్రీధర్‌ (చిట్టిబాబు), పొగాకు బోర్డు రైతు సంఘ మాజీ అధ్యక్షుడు బి.శాంతారెడ్డి, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, మేదరమెట్ల కరుణాకర్‌, కొరిశపాడు శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం

మా 25 కుటుంబాలు టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు అక్కడ పద్ధతులు, పరిస్థితులు మారాయి. మంచి అనేది కనిపించటం లేదు. అందుకే వైఎస్సార్‌ సీపీలో చేరాం. చింతలపూడి అశోక్‌కుమార్‌ మీద నమ్మకం ఉంది. అందుకే పార్టీలో చేరాం. పార్టీకి కట్టుబడి పనిచేస్తాం.

– ఏగూరి శ్రీను, తమ్మవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement