ప్రాణాలు తీసిన పిడుగులు | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన పిడుగులు

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

యర్రగొండపాలెం/మర్రిపూడి: పొలాల్లో పనులు చేసుకుంటూ, జీవాలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాల్లో పిడుగుపాటు పెను విషాదాన్ని నింపింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, మర్రిపూడి మండలాల్లో గురువారం చోటుచేసుకున్న వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటుకు మృత్యువాత పడగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఎనిమిది మేకలు ప్రాణాలు కోల్పోయాయి. యర్రగొండపాలెం మండలంలోని చెన్నరాయునిపల్లెలో గురువారం పిడుగుపాటుకు గురై ఓ రైతు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన పోరెడ్డి చెన్నకేశవులు(32), దేశినేని కేశవులు తమ వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమై పిడుగుపడింది. ఈ దుర్ఘటనలో చెన్నకేశవులు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కేశవులును స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు చెన్నకేశవులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవకుమార్‌ తెలిపారు.

మర్రిపూడి మండలంలోని తంగెళ్ల గ్రామంలో పిడుగుపాటుకు గురై మేకల కాపరితో సహా 8 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. కొండపి మండలం వెన్నూరు గ్రామానికి చెందిన ఎండ్లూరి కోటయ్య (40) సుమారు ఐదేళ్లుగా తన మేనత్త నివాసముంటున్న తంగెళ్ల గ్రామంలో భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్నాడు. సెంట్రింగ్‌, మేసీ్త్ర పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జీవనోపాధి కోసం రెండు మేకలను కాసుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం అదే గ్రామానికి చెందిన మరో కాపరి కల్లగుంట నారాయణతో కలిసి పొలానికి వెళ్లాడు. ఊరి సమీపంలోని చవిటి వాగు వద్దకు చేరుకోగానే ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మేకలతో సహా ఇద్దరూ సమీపంలోని ఓ వేపచెట్టు వద్దకు పరుగుతీశారు. అదే సమయంలో పిడుగుపడటంతో చెట్టును ఆనుకుని నిల్చున్న కోటయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అలాగే కోటయ్యకు చెందిన 2 మేకలు, కల్లగుంట నారాయణకు చెందిన 6 మేకలు అక్కడికక్కడే చనిపోయాయి. కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా విలపించారు. కోటయ్య మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన వెన్నూరుకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement