గిద్దలూరు రూరల్: వినాయక చవితి పూర్తయిన సందర్భంగా నిమజ్జనం చేసే కార్యక్రమంలో వినాయకుడికి అపచారం చేశారు. బుధవారం రాత్రి వినాయకుడి విగ్రహాలను జేసీబీతో ముక్కలు ముక్కలుగా చేసి నిమజ్జనం చేశారంటూ వినాయకుడి పట్ల అపచారానికి పాల్పడటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కంచిపల్లె చెరువులో స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెరువులో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేశామని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో మండలంలోని వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు తరలించారు. చెరువులో కొంత భాగం గుంత తీసి మూడు అడుగుల లోతులో నీటిని ఉంచారు. వినాయకుడి భారీ విగ్రహాలు తక్కువ లోతు ఉన్న గుంతలో మునగడం లేదని గ్రహించి జేసీబీతో వినాయకుడి విగ్రహాలను ముక్కలు చేసి ఇష్టానుసారంగా నీటిలో కలిపే ప్రయత్నం చేశారు. కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేయకుండా అలాగే వదిలేసి వెళ్లారు. మరి కొన్ని విగ్రహాలకు చెందిన ముఖభాగం తొండం, చేతులు, కాళ్లు విడివిడి ముక్కలుగా చెల్లా చెదురుగా పడిపోయాయి. భక్తి పేరుతో ఇటువంటి వికృతచేష్టలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


