● డీవైఎఫ్‌ఐ నాయకుల డిమాండ్
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు డిమాండ్ చేశారు. వేలాది పోస్టులు ఖాళీగా ఉంటే కూటమి ప్రభుత్వం కేవలం 2,050 పోస్టుల భర్తీకే పరిమితం కావడం సరికాదన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక గాంధీనగర్‌లోని భగత్‌సింగ్ విజ్ఞాన కేంద్రం వద్ద డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి యువత తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. గత ఏడేళ్లుగా నోటిఫికేషన్ లేదని హోం మంత్రి వంగలపూడి అనిత చెబుతున్నప్పటికీ, జాబ్ క్యాలెండర్‌లో అరకొరగా 2,050 పోస్టులనే ప్రకటించడం మోసపూరితమన్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక యువత నిరాశలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ స్ఫూర్తితో నిరుద్యోగ సమస్యపై పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని కాకినాడలో ఆందోళన చేపట్టిన విద్యార్థి, యువజన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి 20 వేల పోస్టులను భర్తీ చేయకపోతే ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యువజన నాయకులు టి.దాసు, ఎస్.వెంకటరావు, జాన్ బాషా, షేక్ సుభాని, ఏ.శ్రీను, రాము, వాసు తదితరులు పాల్గొన్నారు.


