ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కొనుగోలు చేస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించవద్దని ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం గురువారం స్థానిక బృందావనం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి ఈయూ జిల్లా అధ్యక్షుడు పిడుగు వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం 1,450 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిందని, వాటిని ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా కాకుండా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కూడా ఆర్టీసీ ద్వారానే చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల నేపథ్యంలో మూసివేసిన విద్యాధర పురం, గుంటూరు 2, నెల్లూరు 2 డిపోలను ఆరు నెలల్లో పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీ్త్ర శక్తి పథకానికి అనుగుణంగా 4 వేల బస్సులను కొనుగోలు చేయాలని సూచించారు. పదోన్నతులపై ఫ్రీజింగ్ ఉన్న నేపథ్యంలో అర్హులైన అన్ని కేడర్ల ఉద్యోగులకు, అధికారులకు ఇస్తున్న విధంగానే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రభుత్వం ఐఆర్ ప్రకటించకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు పాల్పడే వ్యక్తులపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయాలని, ఉద్యోగులు స్వేచ్చగా విధులు నిర్వహించే వాతావరణం కల్పించాలన్నారు. సమావేశంలో ఈయూ నాయకులు వాకా రమేష్, నారాయణ, శాస్త్రి, జీవీ రత్నం, జనార్దన్, బెజవాడ రవి, రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.


