● ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ విక్టర్ ప్రసాద్
జె.పంగులూరు: ఈ నెల 22వ తేదీలోపు నూజిళ్లపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, ఆర్చి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయకపోతే అద్దంకి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ హెచ్చరించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నూజిళ్లపల్లి ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్డీవో విజయ జ్యోతికుమారితో ఫోన్‌లో మాట్లాడి అనుమతులు ఇవ్వాలని, లేనిపక్షంలో తామే విగ్రహ ప్రతిష్ఠ చేపడతామన్నారు. డొంక పోరంబోకు స్థలంలో విగ్రహం, ఎస్సీ కాలనీ ఆర్చి నిర్మాణాన్ని అడ్డుకోవడం ముమ్మాటికీ వివక్షేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో బహుజనుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 18న నిర్వహించే ’చలో పంగులూరు’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 22న తిరిగి నూజిళ్లపల్లికి వస్తానని స్పష్టం చేశారు.


