పొగాకు రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు రైతుల వినతి

మార్కాపురం: పొగాకు రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నించాలని గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలానికి చెందిన పలువురు పొగాకు రైతులు గురువారం మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబును కోరారు. రైతులు అన్నపురెడ్డి వీరారెడ్డి, బిజ్జం రాంభూపాల్‌రెడ్డి, పీరారెడ్డి తదితరులు తమ కష్టనష్టాలు వివరించారు. ఒక ప్రైవేట్‌ కంపెనీ ప్రతినిధులు తమ వద్దకు వచ్చి బార్లీ పొగాకు సాగు చేయాలని, క్వింటా రూ.17 వేలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ప్రస్తుతం అతి తక్కువ ధరకు ఒంగోలులో కొనుగోలు చేస్తున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధుల మాటలు విని రాచర్ల మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో పొగాకు సాగుచేశారని, ఒక్క ఓబులరెడ్డిపల్లి గ్రామంలోనే 200 నుంచి 300 ఎకరాలు సాగుచేశారన్నారు. ఇటీవల తాము పండించిన పొగాకును ఒంగోలుకు తీసుకెళ్లగా క్వింటా రూ.5 వేల నుంచి రూ.6 వేలకు మాత్రమే కొన్నారని, 20 బేళ్లు వేలంలో ఉంచితే 10 మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని తమకు హామీ ఇచ్చిన కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే బెదిరింపు ధోరణితో మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 4 ఎకరాల్లో పొగాకు సాగు చేశానని, కంపెనీ ప్రతినిధులు చెప్పిన ప్రకారం తనకు సుమారు రూ.6 లక్షలు రావాల్సి ఉందని, ప్రస్తుతం ఉన్న ధర చూస్తే లక్షన్నర రూపాయలు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతు పీరారెడ్డి తెలిపారు. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నా రాంబాబుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అన్నా స్పందిస్తూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement