ముండ్లమూరు: ఆర్టీసీ హైర్ బస్సును వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టిన సంఘటన ముండ్లమూరు–వేంపాడు మధ్య చిలకలేరు వాగు వద్ద గురువారం చోటుచేసుకుంది. అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్సు గురువారం 12 గంటల సమయంలో పొదిలి వెళ్తోంది. ఆ సమయంలో మార్కాపురం నుంచి మంగళగిరి వెళ్తున్న లారీ బస్సు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక భాగం కొంత మేర దెబ్బతింది. ఈ పరిణామంతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణభయంతో కేకలు వేశారు. కాగా, ప్రయాణికులను మరొక బస్సులో ఎక్కించి దెబ్బతిన్న బస్సును, లారీ డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బస్సుకు మరమ్మతులు చేయిస్తామని లారీ యజమాని ఒప్పందం చేసుకోవడంతో రెండు గంటల తర్వాత బస్సును డిపోకు తరలించారు.
కురిచేడు: గాలి భీబత్సంతో పాటు వానచినుకులు రావడంతో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచ్రవాహనాలు ఢీకొని ఒకరికి గాయాలైన సంఘటన దర్శి రోడ్డులోని భారత్ పట్రోలు బంకువద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. దర్శిలో వ్యక్తి గత పనులు పూర్తిచేసుకుని కురిచేడుకు చెందిన చలంచర్ల నటరాజు తన ద్విచక్రవాహనంపై కురిచేడు వస్తున్నాడు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరతాడను కునే లోపు ఎదురువచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కింద పడిపోవడంతో తలకు రక్త గాయమైంది. దారిన వెళ్లే ప్రయాణికులు 108 కి సమాచారం అందించటంతో సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం స్తానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు.
హనుమంతునిపాడు: మండల పరిధిలోని వేములపాడు గ్రామ సమీపంలో జామాయిల్ తోటలో పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న పురుషుడి మృతదేహం గురువారం లభ్యమైంది. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న వీఆర్వో బెంజిమెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రాజ్‌కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని మూటకట్టి ఎస్సై, సిబ్బంది రోడ్డు వరకు మోసుకొచ్చారు. పోలీసుల కథనం మేరకు.. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 55 ఏళ్లు ఉంటుంది. అడవి జంతువులు శరీర భాగాలు తిన్న ఆనవాళ్లు ఉన్నాయి. మృతదేహం లుంగీ మాత్రమే ఉంది. కాగా, వారం రోజుల క్రితం వేములపాడు పరిసర ప్రాంతాల్లో ఒక ముసలి వ్యక్తి యాచిస్తూ తిరిగాడని పోలీసుల విచారణలో తేలింది. అతనే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


