జె.పంగులూరు: మండల కేంద్రమైన పంగులూరులోని మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో గురువారం రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ నిర్వాహకుడు, ఖోఖో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు మేకల సీతారామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు బాచిన చెంచుగరటయ్య క్రీడా జ్యోతి వెలిగించారు. అనంతరం జాతీయ పతాకం, ఖోఖో క్రీడా పతాకం ఆవిష్కరించారు. అతిథులు క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వక్తలు క్రీడాకారుల గురించి, గ్రామీణ క్రీడ ఖోఖో నేపథ్యం గురించి వివరించారు. వేసవి కాలం దృష్ట్యా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, పోటీల్లో శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు, నెల్లూరు, కడప, కర్నూలు, అన్నమయ్య, ఉమ్మడి ప్రకాశం నుంచి పురుషుల జట్లు 8, బాలుర జట్లు 8 పాల్గొన్నాయి. ఖోఖో సంఘ రాష్ట్ర కార్యదర్శులు, వివిధ జిల్లాల కార్యదర్శులు, టెక్నికల్ అఫీషియల్స్ సుమారు 300 మంది హాజరయ్యారు.


