పరిహారం కరువైంది! | - | Sakshi
Sakshi News home page

పరిహారం కరువైంది!

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

మోంథా తుపాను పరిహారం కోసం ఆరు నెలలుగా ఎదురుచూపులు

పంటనష్టం తక్కువగా చూపి రైతులను దగా చేసిన ప్రభుత్వం

తొలుత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 62,500 ఎకరాల్లో పంటనష్టం అంటూ ప్రకటన

ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో కేవలం 32 వేల ఎకరాల్లో నష్టంగా తేల్చిన వైనం

తూతూ మంత్రంగా కేంద్ర బృందం పర్యటన

సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు

ఖరీఫ్‌ రుణాల కోసం వడ్డీ వ్యాపారులే దిక్కంటున్న అన్నదాతలు

మోంథా ముంచింది..

మార్కాపురం: మోంథా తుపాను ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేసింది. గత ఏడాది అక్టోబర్‌ 26 నుంచి మోంథా తుపాను ప్రారంభమైంది. 27, 28 తేదీల్లో భారీవర్షం కురిసింది. 28వ తేదీ ఒక్క రోజే రికార్డు స్థాయిలో 25.68 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. పత్తి, వరి, కంది, మినుము, సజ్జ, మొక్కజొన్న, అనుములు, పొగాకు, మిర్చి, నువ్వులు, జొన్న, వేరుశనగ, పెసర, బొబ్బరు, కొర్ర, ఆముదం, అలసందతో పాటు ఉద్యానవన పంటలు వేలాది ఎకరాల్లో భారీగా దెబ్బతిన్నాయి.

నష్టాన్ని తారుమారు చేసి..

వాస్తవానికి మోంథా తుపాను ధాటికి ఉమ్మడి జిల్లాలో మొత్తం 90 వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల వద్ద నుంచి వచ్చిన ఒత్తిడిలతో మొత్తం పట్టనష్టం నివేదికలను మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తొలుత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 62,500 ఎకరాల్లో పట్టనష్టం వాటిల్లిందంటూ జిల్లా అధికారులు పంటల వారీగా వివరాలను విడుదలజేశారు. అలాగే 385 గ్రామాల్లోని దాదాపు 30 వేల మందికి పైగా రైతులు నష్టపోయారని లెక్కల్లో చూపించారు. తర్వాత నవంబరు 5వ తేదీ విడుదల చేసిన నివేదికలో అంకెల గారడీ చేసి కేవలం 32 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తేల్చేశారు. ఇందులో ప్రధానంగా పత్తి 8313 హెక్టార్లు, వరి 1557 హెక్టార్లు, సజ్జ 1388 హెక్టార్లు, మొక్కజొన్న 1260, మినుములు 26 హెక్టార్లు, వేరుశనగ 17, కందులు 89 హెక్టార్లలో నష్టపోయినట్లు నివేదికలు ప్రభుత్వానికి పంపారు. ఆరు నెలలు దాటుతున్నా రైతులకు అందాల్సిన పరిహారం ఇంతవరకూ అందలేదు. ఖరీఫ్‌లో నష్టపరిహారం రబీ సీజన్‌ దాటినా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మరో 15 రోజుల్లో ప్రారంభమవుతున్న ఖరీఫ్‌ సీజన్‌లో పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకోసం అవసరమయ్యే ఖర్చుల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

నాడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రకృతి అనుకూలించకపోయినా, వర్షాలు పడి పంట నష్టం జరిగినా, వర్షంలేక పంటలు ఎండిపోయినా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే ఆ పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడంతో రైతులు ఇబ్బందులు లేకుండా, పెట్టుబడుల కోసం ఇతరులను ఆశ్రయించకుండా వ్యవసాయం చేశారు.

పరిహారం వెంటనే ఇవ్వాలి

గత ఏడాది అక్టోబరు చివరిలో వచ్చిన మోంథా తుపాను తాకిడికి జిల్లా వ్యాప్తంగా సాగైన పంటలు దెబ్బతిన్నాయి. ఇంతవరకూ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి.

– జీ సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రైతు సంఘం కార్యదర్శి

తుపానుతో రూ.10 లక్షలు నష్టపోయా

నేను ఈ ఏడాది 50 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. అయితే పంట వేసిన 60 రోజులకు మోంథా తుపాను వచ్చి పంట మొత్తం పూర్తిగా నష్టం జరిగింది. జిల్లా స్థాయి అధికారులు మా పంటలను పరిశీలించి న్యాయం చేస్తాం, పరిహారం అందేలా చేస్తామని నా దగ్గర నుంచి పంటకు సంబంధించిన వివరాలన్నీ తీసుకున్నారు. అప్పటికే నేను ఎకరాకు సుమారుగా రూ.20 వేల చొప్పున మొత్తం 50 ఎకరాలకు రూ.10 లక్షలు వరకు ఖర్చు చేశాను. తుపాను వల్ల పంట మొత్తం పోయి నష్ట పోవడంతో ఆ తరువాత తిరిగి మళ్లీ పంట సాగు చేయలేకపోయాను. రూ.10 లక్షల నష్టంలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదు.

– గోపతోటి శ్యామ్యూల్‌, వరి రైతు, తిమ్మసముద్రం

Advertisement
 
Advertisement
Advertisement