ఒంగోలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ –2026 ఆన్‌లైన్ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్టులు) పరీక్ష ఒంగోలులోని 6 పరీక్ష కేంద్రాల్లో, మార్కాపురంలోని 2 పరీక్ష కేంద్రాల్లో బుధవారం రెండో రోజు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 236 మంది గైర్హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో ఒంగోలులోని పరీక్ష కేంద్రాల్లో మొత్తం 3,278 మంది విద్యార్థులకు గాను 3136 మంది హాజరుకాగా, 142 మంది గైర్హాజరయ్యారు. అలాగే మార్కాపురంలో మొత్తం 1140 మందికి గాను 1046 మంది హాజరుకాగా, 94 మంది గైర్హాజరయ్యారు.
● తలమళ్లలో ‘నేను బడికి పోతాను’ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ విజయసునీత
పొదిలి రూరల్: పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు..మంచి నడవడిక, సభ్యత నేర్పే బడిలో అని కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. పొదిలి మండలంలోని తలమళ్ల ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో ‘నేను బడికి పోతాను’ కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఉప్పలపాడులో పదో తరగతి ఫెయిలై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున తగిన ప్రణాళికలతో సాగి అనుకున్న ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం ఏడుగురు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో ఉండే వసతులపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మార్కాపురం డిప్యూటీ డీఈఓ ఎం.శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ–2 నాగలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
● డీవైఎఫ్‌ఐ డిమాండ్
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖతో సహా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో వెంటనే భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేవీ పిచ్చయ్య, కె.ఎఫ్ బాబు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు ద్రోహం చేయొద్దన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఇంజినీరింగ్ కోర్సులు చేసి కోచింగ్ లు తీసుకొని ఏఈ, ఏఈఈ ఉద్యోగాల కోసం అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారన్నారు. విద్యుత్ శాఖలో గత ఐదేళ్ల నుంచి ఏఈ, ఏఈఈ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. విద్యుత్ శాఖలో 1500 కు పైగా ఏఈ, ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌కో 285, ఏపీ జెన్కోలో 975, ఏపీ ఈపీడీసీఎల్ 75, ఏపీ ఎస్‌పీడీసీఎల్‌లో 1275, ఏపీ సీపీడీసీఎల్‌లో 542 మొత్తం ఖాళీలు ఉన్నాయి అన్నారు. ఒక్క విద్యుత్ శాఖ లోనే 3782 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారని, పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచితే మరో రెండేళ్లు వీరు కొనసాగుతారని, దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ లో వస్తున్న నోటిఫికేషన్‌లో విద్యుత్ శాఖలో 1500 ఏఈ, ఏఈఈ పోస్టులు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి ఇంజినీరింగ్ పోస్టులు 600 పైగా ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్‌లో మాత్రం కేవలం 132 ఇంజినీరింగ్ పోస్టులు చూపించారన్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖకు సంబంధించి 1000 కి పైగా పోస్టులు ఖాళీలు ఉండగా 328 పోస్టులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి 550 ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్లో 21 మాత్రమే చూపించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి భయపడి వయసు పెంచుకుంటూపోతే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో 34,582 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని, వారిలో వచ్చే నాలుగు సంవత్సరాలులో 80 శాతం మంది రిటైర్డ్ అవుతున్నారన్నారు. తక్షణమే ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి రెగ్యులర్ పరిధిలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


