వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి
దర్శి: రాష్ట్రంలో యువతపై దాడులు చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కర్నూలు పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం ఆలియాస్ బాలుపై అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు యువజన విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏతప్పూ చేయని బాలసుబ్రహ్మణ్యంను పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి ఆత్మహత్యలకు పాల్పడే లా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా బాలు ఇంటికి పోలీసులు వెళ్లి అన్యాయంగా హింసించారన్నారు. పోలీసుల వేధింపులు తాళలేక బాలు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. యువత రాజకీయాల్లో ఉండకూడదని వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అన్యాయంగా జైలుకు పంపడం, వేధింపులకు గురిచేయడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. నిరుద్యోగ యువతకు ఇస్తామన్న రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వమని ప్రశ్నించినందుకు ఇంతగా వేధింపులు, పైశాచికత్వానికి దిగుతారా అని మండిపడ్డారు. ప్రశ్నించే వారిని టార్గెట్ చేసి తప్పుడు కేసులు బనాయించి వారికి ఎక్కడా ఉద్యోగాలు రాకుండా, ఏ పోటీ పరీక్షల్లో పాల్గొననీయకుండా, ఆర్ధిక సంస్థల నుంచి అప్పులు పుట్టకుండా ప్రశ్నించే యువతను అణిచివేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి బలం యువకులే అని, అలాంటి యువతపై పోలీసులు అరాచకానికి దిగితే మాత్రం సహించేది లేదన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా వాటిని ఎదుర్కొంటామని చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా చేస్తే కచ్చితంగా బుద్ధి చెప్తామన్నారు. కార్యక్రమంలో దర్శి, ముండ్లమూరు, కురిచేడు మండల పార్టీ కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్‌రెడ్డి, విద్యార్థి విభాగం జోనల్ ఇన్‌చార్జ్ దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుంటు పోలయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షుడు ఒంటేలు మల్లిఖార్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి యరమల మధుసూదన్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సన్నీ బాబు, తాళ్లూరు యువజన విభాగం అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు కోట బుచ్చన్న చౌదరి, నాయకులు పాణెం మజ్ఞువలి, షేక్ అమీర్‌బాషా, అన్నవరపు రవి, దామెర్ల రామ్మోహన్‌రావు, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


