గత నెల కిలో రూ.100 నుంచి రూ.120 బుధవారం కేజీ రూ.30 నుంచి రూ.35 పడిపోయిన ధర
హనుమంతునిపాడు: నిమ్మకాయలకు ఈ వారంలో ధర భారీగా తగ్గింది. గత నెలలో నిమ్మకాయ నాణ్యత, సైజును బట్టి కొనుగోలుదారులు రైతు వద్ద నుంచి కిలో రూ.100 నుంచి రూ.120ల పైగా కొనుగోలు చేశారు. అయితే బుధవారం నిమ్మకాయల ధర కేజీ ఒక్కసారిగా రూ.30 నుంచి రూ.35 లకు పడిపోయింది. రైతుల వద్ద కిలో కాయ నాణ్యతను బట్టి సన్నకాయ రూ.30 నుంచి రూ.35, పెద్ద సైజు రూ.50 వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెప్తున్నారు. ఒక వైపు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దిగుబడి కూడా తగ్గింది. అయినా కనిగిరిలో వ్యాపారులు కుమ్మకై ్క ఒకే మాటమీద ఉండి రైతులను మోసం చేస్తూ ధరలు దిగ్గోస్తున్నారని నిమ్మ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకు ధరలేక కోత కూలీలు, ఆటో చార్జీలు కూడా రావడం లేదని చెప్తున్నారు. నిమ్మ రైతులను మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులు గాయం వెంకటరెడ్డి, జిలానీ, దేవదానం, కృష్ణారెడ్డి తదితరులు కోరుతున్నారు.


