నగరంలో అపరిశుభ్రతపై కలెక్టర్ అసహనం నగరంలో పర్యటించిన నగర స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదంటూ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ పి.రాజాబాబు మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. బుధవారం ఒంగోలులోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన పారిశుధ్యం అధ్వానంగా ఉండటంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య పనులతో పాటు మురుగు కాలువలు శుభ్రంగా ఉండాలని సూచించారు. అలాగే నిరుపయోగంగా ఉన్న కార్పొరేషన్ స్థలాలను పరిశీలించారు. తొలుత కలెక్టర్ నగర పరిధిలోని కొత్త మామిడిపాలెంలో ఉన్న కంపోస్టింగ్ యూనిట్‌ను సందర్శించి సేంద్రియ వ్యర్థాలను ఎరువుగా మార్చే పద్ధతిని పరిశీలించి నిర్వాహకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించారు. చెత్త సంపద కేంద్రాలు పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తదుపరి కలెక్టర్ గాంధీ పార్కును సందర్శించి పార్కు నిర్వహణను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న వాకింగ్ ట్రాక్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పార్కు పక్కనే నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. పీవీఆర్ స్కూల్ పక్కన నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఊట చెరువు ప్రాంతాన్ని సందర్శించి నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించి ఈ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ స్థలాన్ని, పాత కూరగాయల మార్కెట్ స్థలాన్ని, బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఒంగోలు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజినీర్ ఐషయ్య, ఎంహెచ్‌ఓ వైష్ణవి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


