అంధ మహిళా ఉద్యోగి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

అంధ మహిళా ఉద్యోగి దారుణ హత్య

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

ఇరిగేషన్‌ శాఖలో పనిచేస్తున్న, అంధురాలైన మహిళా ఉద్యోగి దారుణహత్యకు గురయ్యారు. ఒంగోలు ఆర్టీసీ డిపో వెలుపలి వైపు ఓ లాడ్జిలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ హత్య స్థానకంగా కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. సీఎస్‌పురం మండలం బొడ్డువారిపల్లికి చెందిన ఆదిలక్ష్మి(38) ప్రస్తుతం ఒంగోలు ఎన్‌జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె ఆరేళ్ల క్రితం అంధుడైన వరప్రసాద్‌ను కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మంగళవారం విధులకు వెళ్లిన ఆదిలక్ష్మి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులు కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిలక్ష్మి ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఆమె శ్రీరామ్‌ లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కీ రిజిస్టర్‌లో ఆదిలక్ష్మి సమీప బంధువు వెంకటరమణ పేరుతో ఒక గది బుక్‌ అయి తాళం వేసి ఉంది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కొంతసేపు నిందితుడి రాక కోసం వేచిచూశారు. మరో తాళంతో గది తలుపులు తెరిచి చూడగా ఆదిలక్ష్మి రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఆమెను గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమీప బంధువు వెంకటరమణతో ఆదిలక్ష్మి సన్నిహితంగా ఉంటుందన్న విషయం తెలియడంతో ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. పరారైన వెంకటరమణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ హర్షవర్థన్‌ రాజు పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఒన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఒంగోలు టౌన్‌:

మూడు బృందాలతో గాలింపు : ఎస్పీ

ఇరిగేషన్‌ శాఖ ఉద్యోగి ఆదిలక్ష్మి మిస్సింగ్‌పై ఫిర్యాదు అందగానే దర్యాప్తు ప్రారంభించామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీరామ్‌ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ హర్షవర్థన్‌ రాజు తెలిపారు. వెంకటరమణ అనే వ్యక్తి పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడని, హత్యకు గల కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. నిందితుని జాడ కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. లాడ్జిల్లో తనిఖీలను ముమ్మరం చేస్తామని చెప్పారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి..

అంధురాలు ఆదిలక్ష్మిని దారుణంగా హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నగరంలోని అంధులు డిమాండ్‌ చేశారు. బుధవారం రాత్రి హత్య జరిగిన లాడ్జి ముందు అంధులు ధర్నా చేశారు. పోలీసులు పక్కాగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేయాలని, మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు.

నమ్మకంగా లాడ్జికి తీసుకెళ్లి గొంతు కోసి చంపిన దుండగుడు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్థన్‌ రాజు

Advertisement
 
Advertisement
Advertisement