కందుకూరు: మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల కన్నతల్లిపై క్రూరంగా ప్రవర్తించాడు ఓ ప్రబుద్ధుడు. కర్రతో తీవ్రంగా కొడుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. కందుకూరు పట్టణంలోని పోతురాజుమిట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణం బుధవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. పోతురాజుమిట్ట ప్రాంతానికి చెందిన తన్నీరు నర్సమ్మ అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడు, కుమార్తె చనిపోగా, ఓ కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం ఆమె చిన్న కుమారుడైన ప్రసాద్ వద్ద ఉంటోంది. ఆమె పేరిట ఉన్న పొలం, ఇల్లు కూడా ప్రసాద్‌కే రాసిచ్చింది. ప్రసాద్‌కు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ప్రసాద్ పెట్టే హింసను భరించలేక పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బేల్దారి పనులు చేసే ప్రసాద్‌కు మద్యం తాగి తిరగడం దినచర్యగా మారింది. ఈ క్రమంలో 85 ఏళ్ల వయసున్న తల్లిని గత కొంతకాలంగా తీవ్రంగా హింసిస్తున్నాడు. ప్రతినెలా ఆమెకు వచ్చే పింఛను డబ్బు కూడా లాగేసుకుంటూ క్రూర మృగంలా ప్రవర్తించసాగాడు. తల్లిని కర్రతో కొడుతూ హింసిస్తున్న సమయంలో బంధువులు వీడియో తీసి బుధవారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నిందితుడు ప్రసాద్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు కందుకూరు టౌన్ ఎస్సై శివనాగరాజు తెలిపారు. వృద్ధురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కన్న తల్లిని దారుణంగా కొట్టిన రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
85ఏళ్ల వృద్ధురాలిని కొట్టి హింసిస్తున్న కుమారుడు
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
రాక్షసుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


