అద్దంకి: ఆరు ఎకరాల్లో పండిన మొక్కజొన్న కండెలు కోత కోసి కుప్ప వేయగా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన అద్దంకి మండలంలోని గోవాడ పంచాయతీ సాధునగర్ పొలాల్లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు గానుగపెంట ఆదాం ఈ ఏడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. మొక్కలు పడిపోవడంతో కండెలు కోయించి కుప్పగా పోశాడు. గురువారం కండెలను ఇంటికి తోలుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే కండెలకు నిప్పంటుకోవడంతో దాదాపు 50 క్వింటాళ్ల మొక్కజొన్న అగ్నికి ఆహుతయ్యాయి. అసలే ధర లేదు.. పండించిన పంట అగ్గిపాలైందని కన్నీటి పర్యంతమయ్యాడు. పొలంలో మొక్కజొన్న ఎండు ఆకుపై సిగరెట్ ఆర్పకుండా పడేయడంతో మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.


