రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రూ.2 కోట్లకు పైగా నిధులతో ఆధునికీకరించిన రెడ్డి హాస్టల్ ప్రారంభం డాక్టర్ వైఎస్సార్, నీలం సంజీవరెడ్డి విగ్రహాల ఆవిష్కరణ
ఒంగోలు వన్‌టౌన్: సమాజంలో ఆర్ధికంగా ఉన్న వారు తోటి వారిని అభివృద్ధి చేయాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఆధునికీకరించిన రెడ్డి హాస్టల్‌ను వైవీ సుబ్బారెడ్డి బుధవారం రాత్రి ప్రారంభించారు. కార్యక్రమానికి రెడ్డి జనాభ్యుదయ సంఘ అధ్యక్షుడు కేవీ రమణా రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా విద్య పూర్తయిన విద్యార్థులకు ఉపాధి కలుగుతుందని చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ నిర్వహణకు నిధులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా ఆడిటోరియం, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అనేక సార్లు హాస్టల్‌ను పరిశీలించానన్నారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. తన సొంత కళాశాల కంటే, రెడ్డి హాస్టల్‌పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం హాస్టల్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. విద్యార్థులకు అనేక విధాలుగా సహాయ, సహకారాలు అందించినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతోనే రెడ్డి హాస్టల్ అభివృద్ధి చెందినట్లు తెలిపారు. విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ, అత్యాధునిక కాన్ఫరెన్స్ హాలు, సోలార్ విద్యుత్, స్టీమ్ కుకింగ్ వంటి వసతులు చేసినట్లు చెప్పారు. జిల్లాకు చెందిన ఐఏఎస్ తాటిపర్తి వెంకారెడ్డి కుమారుడు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. అతిథి గృహాన్ని కూడా నిర్మించినట్లు తెలిపారు. నీలం సంజీవరెడ్డి ఒక్కరే ఏకగ్రీవంగా ఎన్నికై న రాష్ట్రపతి అని అన్నారు. రామ రాజ్యాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరిపించారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా రూ.2 కోట్లకు పైగా నిధులతో సోలార్ విద్యుత్, ప్రధాన ద్వారం, గదులకు అటాచ్డ్ బాత్‌రూంలు, వంటగది, డిజిటల్ లైబ్రరీ, మినరల్ వాటర్ ప్లాంట్, కాన్ఫరెన్సు హాలు, ప్రాంగణం మొత్తం గ్రానైట్ రాళ్ల ఏర్పాటు, అతిథి గృహం తదితర నూతనంగా ఏర్పాటు చేసిన, ఆధునికీకరించిన వివిధ విభాగాలను ప్రారంభించారు. వైవీ సుబ్బారెడ్డి జన్మదినోత్సవం మే 1వ తేదీ సందర్భంగా ముందస్తుగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్డి జనాభ్యుదయ సంఘ కార్యదర్శి అన్నపురెడ్డి చిన ఆదిరెడ్డి, వైవీ భద్రారెడ్డి, వైవీ హనుమారెడ్డి, శిరిపురం విజయభాస్కరరెడ్డి, ఢాకా కృష్ణారెడ్డి, వాకా సంజీవరెడ్డి, భవనం నాగిరెడ్డి, నరహరి రామలింగారెడ్డి, పాలవెల్లి వెంకటేశ్వరరెడ్డి, గోపవరపు నారాయణ రెడ్డి, లింగా రెడ్డి, స్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్, నీలంసంజీవరెడ్డి విగ్రహావిష్కరణలో వైవీ సుబ్బారెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి, బత్తుల


