రాచర్ల: గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు చేశారు. ఈ సంఘటన మండలంలోని యడవల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పురాతన ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి గాలివాన కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆలయంలోని ధ్వజస్తంభంతో పాటు నందీశ్వరుడి విగ్రహం చుట్టు దాదాపు మూడు అడుగుల లోతు వరకు గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు చేశారు. రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావుకు సమాచారం ఇవ్వగా గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయంలోని ధ్వజస్తంభంతో పాటు నందీశ్వరుడి విగ్రహం చుట్టు ఉన్న తవ్వకాలను బుధవారం పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవనగర్‌లో ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు నగలు, నగదు అపహరించిన సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు వివరాలు.. చెన్నకేశవనగర్‌లో నివాసం ఉంటున్న తిప్పిరెడ్డి వెలుగొండారెడ్డి ఈ నెల 22న బెంగళూరులో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన బంధువు ఒకరు వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్లగా ఇంటి తలుపు పగలగొట్టి ఉంది. దీంతో వెలుగొండారెడ్డికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. ఇంటి యజమాని సూచన మేరకు లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో దాచి ఉంచిన బంగారు నగలు, రూ.25 వేల నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ చోరీకి విఫలయత్నం
మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో ఉన్న ఓ వైద్యశాల సమీపంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన మోటారు సైకిల్‌ను మంగళవారం రాత్రి చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. తమ పాచిక పారకపోవడంతో వెనుదిరిగారు.
కంభం: మండలంలోని చిన్నకంభం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ట్రావెల్స్ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. పోరుమామిళ్లపల్లి గ్రామానికి చెందిన మారాబత్తుని శ్రీనివాసరావు(23) నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
● 20 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు అపహరణ
పెద్దారవీడు: వైద్య చికిత్స కోసం ఓ కుటుంబం గుంటూరు వెళ్లగా.. దొంగలు చేతివాటం చూపి భారీగా నగలు, నగదు కొల్లగొట్టారు. ఈ సంఘటన పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆనెకాళ్ల వెంకటేశ్వరెడ్డి వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం గుంటూరు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన దొంగలు లోపలికి చొరబడి బీరువాను బద్ధలుకొట్టారు. అందులో ఉన్న 20 తులాల బంగారు నగలు, రూ.2 లక్షలు నగదును అపహరించారు. వెంకటేశ్వరరెడ్డి ఇంటి తలుపులు బుధవారం ఉదయం తెరిచి ఉండటాన్ని పక్కింటి వారు గమనించారు. ఆస్పత్రికని వెళ్లిన వారు అప్పుడే తిరిగొచ్చారా అని పక్కింటి వారు లోపలికి వెళ్లి చూడగా ఎవరూ కనిపించకపోవడంతోపాటు బీరువా తలుపులు తీసి ఉన్నాయి. చోరీ జరిగిందని అనుమానం రావడంతో వెంటనే వెంకటేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. వారు ఇంటికి వచ్చి చూడగా బీరువాలో ఉన్న బంగారు నగలు, డబ్బు కనిపించలేదు. బాధితుల సమాచారంతో సంఘటన స్థలాన్ని త్రిపురాంతకం సీఐ హసన్, ఎస్సై సైదుబాబు పరిశీలించారు. ఒంగోలు నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరు కుమార్తెల వివాహం కోసం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దొంగలు కాజేయడంపై వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


