పేదల భూములపై డేగల పంజా...! | - | Sakshi
Sakshi News home page

పేదల భూములపై డేగల పంజా...!

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

కందుకూరు రూరల్‌:

లవపాడు మండలం బద్ధిపూడి గ్రామ రెవెన్యూ, పొలిమేర పరిధిలో మన్నేరు ఒడ్డును 1988లో బద్ధిపూడి గ్రామానికి చెందిన ఎస్సీలకు 72 మందికి ఒక్కొక్కరికి అర ఎకరా చొప్పున ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఈ పొలాల్లో తొలుత వారు మామిడి మొక్కలు సాగు చేశారు. అయితే 1996లో రాళ్లపాడు ప్రాజెక్టు తెగినప్పుడు మామిడి తోటలన్నీ కోట్టుకుపోయాయి. దీంతో రైతులు మామిడి సాగు చేయకుండా వేరుశనగ, జామాయిల్‌ సాగు చేశారు. అయితే ఏ పంట సాగు చేసినా మన్నేరుకు నీరు వచ్చినప్పుడు నష్టం వాటిల్లుతుంది. దీంతో కొందరు జామాయిల్‌ సాగు చేస్తుండగా..మరికొందరు ఇతర పనులకు వెళుతూ భూములను పట్టించుకోవడం లేదు. గతంలో ఇసుక తవ్వకాలు చేసుకుంటామని ఎస్పీ రైతులు అధికారులను సంప్రదించినా అనుమతి ఇవ్వలేదు.

నాణ్యత..డిమాండ్‌

ఎస్సీలకు ఇచ్చిన 54.31 ఎకరాల్లోని నాణ్యమైన ఇసుక ఉంది. ఈ ఇసుకకు బయట మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల కన్ను ఈ భూములపై పడింది. నాణ్యమైన ఇసుకను తవ్వేసి కోట్ల రూపాయలు వెనకేసుకోవాలని పథక రచన చేశారు. ఈ ఎస్సీల పొలాల పక్కనే మాచవరం రెవెన్యూ పరిధిలో శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన రైతుల పాలాలు ఉన్నాయి. 334/1లో 6.76 ఎకరాలు భూమి ఉంది. ఇందులో కె.బుజ్జమ్మకు సుమారు 2.27 ఎకరాలు ఉన్నట్లు చెబుతున్నారు. మన్నేరు కరకట్ట వెలుపలు మాచవరం రెవెన్యూలోనే 6.76 ఎకరాలు ఉంది. కానీ కె.బుజ్జకు మాత్రం మన్నేరు కరకట్ట లోపలకి 2.27 ఎకరాలు మాత్రమే రికార్డులు ఉన్నాయి. అయితే బుజ్జమ్మ పొలంలో ఇసుక తవ్వకాల పేరుతో ఈ 54 ఎకరాల్లో ఇసుకను తవ్వేలా ప్లాన్‌ వేశారు. బుజ్జమ్మ పొలంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని కొందరు అక్రమార్కులు రంగప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎదురుతిరుగుతున్నారు. ఎస్సీల భూములకు ఎదురుగా మాత్రమే కె.బుజ్జమ్మ, వారి బంధువులకు పొలం ఉందని, కానీ వారు మన్నేరులోకి వచ్చి ఎలా ఇసుక తవ్వకాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని, కానీ చూపించమంటే చూపించడం లేదని రైతులు వాదిస్తున్నారు.

రూ.3 కోట్లకు వ్యాపారితో డీల్‌..

అయితే ఎస్సీలకు ఇచ్చిన పొలాల్లో తవ్వకాలకు శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలతో ఒప్పందం కుదుర్చొకున్నారు. ఒంగోలుకు చెందిన ఓ ఇసుక వ్యాపారితో మూడు కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నారు. అక్కడ ఉంది 2.27 ఎకరాలే కదా మూడు కోట్లు ఎలా డీల్‌ కుదిరిందంనుకుంటే పప్పులో కాలేసినట్లే. పేరుకు మాత్రం 2.27 ఎకరాలే, కానీ దాన్ని అనుకొని ఉన్న ఎస్సీల భూములైన 54.31 ఎకరాల్లోని ఇసుకను తవ్వకునేలా ప్లాన్‌ కుదుర్చుకున్నారట. మొత్తం మా ఆధీనంలోనే ఉందని మూడు కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అసలు బుజ్జమ్మ పొలంలో ఇసుకనే లేదు. ఆ పేరు చెప్పుకొని ఆ పక్కనే ఎస్సీల భూముల్లోని ఇసుకను కాజేసేందుకు స్కేచ్‌ వేశారు. రెండు రోజుల నుంచి జేసీబీతో సుమారు పది అడుగుల మేరకు ఇసుక తవ్వకాలు చేశారు. ఇసుకను తీసుకొచ్చి గోపాలపురం సమీపంలో డంప్‌ చేసి టిప్పర్లకు, లారీలతో తరలిస్తున్నారు. జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఈ ఇసుకను తరలించి కోట్లు సంపాదించుకుందనేకు ప్లాన్‌ చేశారు. ఈ ప్రాంత మన్నేరులోని ఇసుక నాణ్యమైనది కావడంతో మంచి డిమాండ్‌ ఉంది. శ్రీరంగరాజపురం, గోపాలపురం గ్రామాల కూటమిలోని కొందర నాయకులతో ఒప్పందం కుదుర్చుకొని తవ్వకాలు చేస్తున్నారు. ఆ డబ్బులు పంపకాల్లో కూడా గ్రామంలోని కొందరి మధ్య విబేధాలు కూడా వచ్చినట్లు సమాచారం.

పేదల భూములపై పెద్దల కన్ను పడింది. ఏం చేసినా ఎవరు అడ్డుకుంటారని బెరితెగించారు. ఒంగోలుకు చెందిన వ్యాపారితో డీల్‌ కుదిరింది. కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. అధికారం అండగా ఇసుక ఇవ్వకాలకు ఏకంగా కిలోమీటర్‌ పైనే రోడ్డు సైతం వేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే అధికార పార్టీ నేతల దోపిడీకి అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మన్నేరు 54.31 ఎకరాల్లో ఇసుక తవ్వకాలకు ప్లాన్‌

ఒంగోలుకు చెందిన వ్యాపారికి రూ.3 కోట్ల డీల్‌

శ్రీరంగరాజపురానికి చెందిన

కొందరితో ఒప్పందం

కిలో మీటరు మేర రోడ్డు ఏర్పాటు

జేసీబీలతో తవ్వకాలు చేసి టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు

నాణ్యమైన ఇసుక కావడంతో మంచి డిమాండ్‌

తవ్వకాలను అడ్డుకున్న బద్ధిపూడి గ్రామస్తులు

Advertisement
 
Advertisement
Advertisement