ఒంగోలు టౌన్: కార్మికులే అసలు సిసలు సంపద సృష్టికర్తలని, దేశ ప్రజల శ్రమశక్తిని దోచుకునే కార్పొరేట్ల వల్ల కలిగే ప్రయోజనం శూన్యమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య అన్నారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా 12వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. సభకు ముస్తఫా, కరుణాఽనిధి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులు కట్టుబానిసలుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశంలోని అన్నీ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చించకుండా కేవలం మూడు గంటల వ్యవధిలోనే చట్టం ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారని తెలిపారు. చట్టాల్లో ఉన్న అభ్యంతరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించకపోవడం నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. లేబర్ కోడ్లతో కార్మికుల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయని, చివరకు సంఘం పెట్టుకునేందుకు కూడా కార్మికులకు అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. ఇప్పటికై నా కార్మికులంతా ఏకమై నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగు రాధా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ...దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేసిందని విమర్శించారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ ఆరు సార్లు దేశవ్యాప్త సమ్మె నిర్వహించిందని తెలిపారు. కొత్త చట్టం అమలులోకి వచ్చిన కారణంగా ఇక పర్మినెంట్ ఉద్యోగాలు ఉండవని చెప్పారు. కేవలం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోతుందన్నారు. ఎన్నికలకు ముందు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు గెలిచి గద్దెనెక్కిన తరువాత బిజేపీ అడుగుల్లోనే నడుస్తున్నాడని విమర్శించారు. తొలుత సీనియర్ నాయకులు సర్దార్ ఏఐటీయూసీ పతాకాన్ని అవిష్కరించగా యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ నూతన కమిటీ ఎన్నిక....
మహాసభల అనంతరం జిల్లా నూతన కమిటిని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా టంగుటూరి ప్రభాకర్, కార్యదర్శిగా కొత్తకోట వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కె.మురళి, సింగరకొండ శ్రీను, కాకుమాని రమణమ్మ, కేఎల్‌డీ ప్రసాద్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా కోటంశెట్టి హనుమంతరావు, వై.ఆనందమోహన్, సహాయ కార్యదర్శులుగా కె.నాగేశ్వరరావు, రాజీవ్ రతన్ దేవ్, ఎస్.పోలయ్య, శ్రీరాం శ్రీనివాసులు, కోశాధికారిగా ఎంఏ సాలార్, మరో 33 మంది సభ్యులను ఎన్నుకున్నారు.


