గిద్దలూరు రూరల్: పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని అర్బన్ కాలనీలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బొల్లాని పోలయ్య తన భార్య అల్లూరమ్మతో ఘర్షణ పడుతూ మద్యం మత్తులో తన ఒంటిపై పెట్రోల్‌పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అల్లూరమ్మ అక్రమ సంబంధం పెట్టుకొని తనను కొన్ని రోజులుగా దూరంగా ఉంచుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని పోలయ్య పోలీసులకు తెలియజేశాడు. ప్రమాదంలో పోలయ్య శరీరం 80శాతం మేర కాలిపోయింది. దీంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
టంగుటూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సూరారెడ్డిపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఇన్‌చార్జి ఎస్సై మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..గుర్తు తెలియని వాహనం రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


