ముంపు ప్రాంతంలో ఎవరైనా ఇళ్లు కట్టుకుంటారా చంద్రబాబును నమ్మి అమరావతిలో పెట్టుబడులు పెట్టే రియల్టర్లు నష్టపోతారు అమరావతి రాజధాని పూర్తి కావడానికి మరో 50 ఏళ్లు మావిగన్‌తో వెనువెంటనే రాజధాని అందుబాటులోకి.. వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు
ఒంగోలు టౌన్: జగనన్న 5 జి అయితే చంద్రబాబు 2జి లాంటి వాడని, కాలం చెల్లిన ఆలోచనలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం అప్పుల పాలు కాకూడదనే సదుద్దేశంతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుకొని రాజధాని కారిడార్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తుంటే బుర్రలేని ఎల్లో మీడియా, పచ్చపార్టీ కార్యకర్తలతో కలిసి ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పారు.
మూడు పంటలు పండే అమరావతి నేలపై రాజధాని నిర్మిస్తానని చెప్పి రైతులను నమ్మించి భూములు తీసుకున్నాడని, ప్రస్తుతం నిర్మించిన సచివాలయానికి 100 అడుగుల లోతు పునాదులు తవ్వారని, మెత్తటి నేలలో , నీటి ముంపు ప్రాంతంలో ఎవరైనా రాజధాని నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా నేటికీ 50 వేల ఎకరాలలో ఉందని, రాయపూర్‌లో 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించినా నేటికీ అక్కడ జనం నివసించడంలేదని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్లతో పార్లమెంటు భవనం నిర్మించారని, అమరావతిలో తాత్కాలిక సచివాలయం కోసం రూ.1500 కోట్ల ఖర్చు చేయడం ఎంత వరకు సమర్ధనీయమని నిలదీశారు. స్కీంల కోసం, స్కాంల కోసం రాజధాని కట్టి ప్రజలను అప్పుల పాలు చేయడం మంచిదికాదని హితవుపలికారు. రాజధాని పేరుతో రూ.లక్షల కోట్లు అప్పులు చేయడం పొరపాటు నిర్ణయమని, రేపు భావితరాలు ఆ అప్పులు తీర్చలేక అల్లాడిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడాన్ని చూడలేక జగనన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రతిపాదనలు చేశారని తెలిపారు. ఒక ప్రతిపక్ష నాయకుడు చేసిన సూచనపై చర్చించాల్సిందిపోయి పార్టీ కార్యకర్తలు, అనుకూల పత్రికల చేత తప్పుడు రాతలు రాయించడం చరిత్ర క్షమించదని హెచ్చరించారు. తక్కువ ఖర్చుతో పెద్ద రాజధాని అందుబాటులోకి రావడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించడం సహించలేక రోతరాతల రాధాకృష్ణ చేత బూతులు రాయించి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. జగనన్న చేసిన ప్రతిపాదనతో కేవలం రూ.20 వేల కోట్లతోనే రాజధాని అందుబాటులోకి వస్తుందని, ఒక్క రూపాయి అప్పులు చేయాల్సిన అవసరముండదని వివరించారు. అమరావతి పేరుతో చేస్తున్న అప్పులను ఇతర అభివృద్ధి పనులకు కేటాయిస్తే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. చంద్రబాబు పాత ఆలోచనలు చేస్తున్నారని, జగనన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మచిలీపట్నంలో జగనన్న హయాంలో నిర్మించిన పోర్టు ఉందని, విజయవాడ, గుంటూరుల్లో రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు ఉన్నాయని, మౌలిక సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో రాజధాని కట్టడం మంచిదా, ఎలాంటి సౌకర్యాలు లేని ప్రదేశంలో, ప్రతి ఏడాది వరదలొచ్చి ముంపునకు గురయ్యే ప్రాంతంలో అమరావతి నిర్మించడం మంచిదో ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబును నమ్మి భూములు కొంటే రియల్టర్లు తీవ్రంగా నష్టపోతారని, గతంలో కూడా అనేక మంది నష్టపోయారని, ఇప్పుడు చేతులు కాల్చుకోవద్దని చెప్పారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని ఒట్టిచేతులు చూపుతున్న చంద్రబాబు రూ.లక్షల కోట్లు పెట్టి రాజధాని కడతామని చెబితే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇప్పటికై నా భేషజాలు వీడి జగనన్న చేసిన సూచనను అమలు చేయాలని, మావిగన్ పేరు నచ్చకపోతే మీకు ఇష్టమొచ్చిన పేరు పెట్టుకోవాలని కోరారు. 21 గ్రామాల అమరావతి రాజధాని వద్దన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, కొత్తపట్నం మండలాధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, నగర పాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ ఎండీ ఇమ్రాన్ ఖాన్, సీనియర్ నాయకులు దామరాజు క్రాంతికుమార్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, పేరం ప్రసన్న, గోనెల మేరి , మాధవి, కామేపల్లి విజయ, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్, కరుణాకర్, గుడ్డల వెంకటేశ్వర్లు, గున్నా అమర్, చిన్నా, సాయి, శివ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.


