పోతవరంలో కలెక్టర్‌ పల్లెనిద్ర | - | Sakshi
Sakshi News home page

పోతవరంలో కలెక్టర్‌ పల్లెనిద్ర

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

స్థానిక సమస్యలపై గ్రామస్తులతో మాటా మంతి పలు అంశాలు కలెక్టర్‌ దృష్టికి తెచ్చిన గ్రామస్తులు

దర్శి: మండలంలోని పోతవరంలో శుక్రవారం కలెక్టర్‌ పీ రాజాబాబు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన కలెక్టర్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి గ్రామంలోకి వెళ్లి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలు తెలిపేందుకు పక్క గ్రామాల నుంచి కూడా ప్రజలు హాజరయ్యారు. వారి సమస్యలు కలెక్టర్‌కు విన్నవించారు. పోతవరంలో సీసీరోడ్లు వేయాలని, దెబ్బతిన్న తిమ్మాయిపాలెం–పోతవరం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. తానంచింతలలో సైడ్‌ కాలువలు నిర్మించాలని, రోడ్డు ఆక్రమణలు తొలగించాలని కోరారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువుకు సాగర్‌ కెనాల్‌ నుంచి పైప్‌లైన్‌ల ద్వారా నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేసి నీటి ఎద్దడి లేకుండా చూడాలని విన్నవించారు. పలువురు భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. తాత్కాలికంగా మంజూరైన సదరన్‌ క్యాంప్‌ సర్టిఫికెట్‌లను పరిమినెంట్‌ సర్టిఫికెట్‌లుగా మంజూరు చేయాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. దేవవరంలో పూర్వం నుంచి 90 మంది సన్న, చిన్న కారు రైతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారని వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో అధికంగా డయాలసిస్‌ పేషెంట్‌లు ఉన్నారని, వీరు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారని దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. అనంతరం గ్రామంలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో మొదటగా పోతవరం గ్రామంలో పల్లనిద్ర నిర్వహించామన్నారు. అధికారులు చేసే పని వలన ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెల్లవారిన తరువాత కూడా కొన్ని గ్రామాలు తిరిగి ఉదయం అందరితో కలసి మాట్లాడతానన్నారు. ఆయా శాఖల అధికారులు మండలంలోని ఇతర గ్రామాల్లో పల్లె నిద్ర చేపట్టారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ జాన్సన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement