సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీకి చెందిన ఓ బండల వ్యాపారి కోసం గిద్దలూరు మున్సిపాలిటీ నిధులను ఖర్చు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు సమీపంలో ఓ వీధిలో టీడీపీ నాయకుడు రంగనాథ్ బండల వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఒక్కడి వ్యాపారం కోసం ఏకంగా సిమెంట్ రోడ్డు వేయడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీధిలో రైల్వే ట్రాక్ వరకు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఒక్క నివాస గృహం లేదు. అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో కొన్నేళ్ల నుంచి రంగనాథ్ బండల వ్యాపారం కొనసాగిన్నాడు. ఈ వీధి మీదుగా స్థానికులు ఎక్కువగా ఖాళీ స్థలాల్లోకి మలమూత్ర విసర్జన కోసం వెళుతుంటారు. పట్టణంలోని అనేక వీధులకు సరైన రోడ్డు వసతి లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా టీడీపీ నాయకులు మాత్రం వారి స్వార్థానికి ఒక్కరి కోసం ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడం పై ప్రజలు మండిపడుతున్నారు.


