పేరుకే మోడల్‌.. మెనూ ఢమాల్‌..! | - | Sakshi
Sakshi News home page

పేరుకే మోడల్‌.. మెనూ ఢమాల్‌..!

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

చుండి మోడల్‌ స్కూల్లో

అధ్వానంగా మధ్యాహ్న భోజనం

300 మంది విద్యార్థులకు

25 కేజీల బియ్యంతోనే తయారు

మెనూ ప్రకారం తయారు చేయాల్సింది

45 కేజీల బియ్యంతో..

గుడ్లు కూడా 150 మాత్రమే..

ఆందోళన వ్యక్తం చేస్తున్న

విద్యార్థులు, తల్లిదండ్రులు

మెనూపై సీఎం చంద్రబాబు మాటలు

నీటి మూటలేనంటూ విమర్శలు

వలేటివారిపాలెం:

డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం విషయంలో సీఎం చంద్రబాబు మాటలు సైతం నీటి మూటలేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు మెనూ ప్రకారం చక్కగా వండిపెడుతున్నామని పదేపదే సీఎం చెబుతుండగా, ఆచరణలో అలా జరగడం లేదని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతోంది. వలేటివారిపాలెం మండలంలోని చుండి మోడల్‌ స్కూల్లో మధ్యాహ్న భోజనం మెనూపై అక్కడ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని గురువారం శ్రీసాక్షిశ్రీ పరిశీలించింది. అక్కడ మెనూ అమలు తీరు అధ్వానంగా ఉన్న విషయం వెలుగుచూసింది. సగానికి సగం దిగ్గోసి విద్యార్థులకు మెనూ అమలు చేస్తుండటం, కూరల్లో ఏమాత్రం నాణ్యత లేకపోవడం వంటివి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలిచాయి. స్కూల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సుమారు 300 మంది ఉండగా, మెనూ ప్రకారం ఒక్కొక్కరికి 150 గ్రాముల బియ్యం చొప్పున 45 కేజీల బియ్యంతో భోజనం తయారు చేయాలి. కానీ, కేవలం 25 కేజీల బియ్యంతోనే భోజనం తయారు చేశారు. పైగా, 300 మంది విద్యార్థులకు 150 గుడ్లు మాత్రమే సిద్ధం చేశారు. అరకొరగా వండిన వెజిటేబుల్‌ బిర్యానీ, నీళ్లనీళ్లగా కుర్మా దర్శనమిచ్చాయి. వాటిపై అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించగా, చాలా మంది విద్యార్థులు తినడం లేదంటూ పొంతన లేని సమాధానం చెప్పకొచ్చారు.

చుండి మోడల్‌ స్కూల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ హవా నడుస్తోందని, విద్యార్థులకు సగం మెనూ మాత్రమే అమలు చేస్తూ.. మిగిలిన సగం సరుకులు అతని ఆధ్వర్యంలో బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల సిఫార్సు మేరకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కాంట్రాక్ట్‌ పద్ధతిపై స్కూల్లో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమించారు. సదరు జూనియర్‌ అసిస్టెంట్‌ రెచ్చిపోతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతుండగా, అతనికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే కారణంతో పాటు అవినీతి సొమ్ములో వాటా అందడంతో ప్రిన్సిపాల్‌, ఇతర అధికారులు సైతం పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో ఆ జూనియర్‌ అసిస్టెంట్‌ రోజురోజుకూ మరింత పేట్రేగిపోతున్నాడు. 300 మంది విద్యార్థులకు సగమే మెనూ పాటిస్తూ మిగిలిన సరుకులన్నీ మింగేస్తున్నాడు. దానిపై అతన్ని ‘సాక్షి’ ప్రశ్నించగా, అధికారులు తనకు 25 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారని, 150 గుడ్లే అందించారని, అంతకుమించి తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు. విద్యార్థుల అటెండెన్స్‌ గురించి ఆరా తీయగా, వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు. గత మార్చి నెల 15వ తేదీ నుంచి ఇదే విధంగా అరకొరగా మెనూ అమలు చేస్తున్నారంటూ పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాక్షి దృష్టికి తీసుకొచ్చారు. తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పవద్దంటూ వారు భయపడుతున్నారు. ప్రిన్సిపాల్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కుమ్మక్కయి విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావుపై మధ్యాహ్న భోజనం విషయంలో గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. గతేడాది నవంబర్‌లో మధ్యాహ్న భోజనం చాలా తక్కువగా ఉండటంతో విద్యార్థులు గొడవకు దిగారు. అదే సమయంలో విద్యార్థులపై ప్రిన్సిపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేసి కొంత మెనూ పెంచారు. ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు భోజనం పెట్టించారు. మధ్యాహ్న భోజనం వండే సిబ్బందిని బెదిరిస్తూ తాను చెప్పిన విధంగా నడుచుకోవాలని హుకుం జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులకు విషయం చెబితే ఊరుకోనంటూ విద్యార్థులను బెదిరిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకుని సక్రమంగా మెనూ అమలు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

జూనియర్‌ అసిస్టెంట్‌ చెప్పిందే సమాధానం :

చుండి మోడల్‌ స్కూల్లో మెనూ అమలు చేయకపోవడంపై ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావును సాక్షి వివరణ కోరగా, తాను నెల్లూరులో మీటింగ్‌కు వచ్చానని తెలిపారు. ఈ రోజు ఇన్‌చార్జిగా వేరే టీచర్‌ ఉన్నారని చెప్పారు. ఆమెను సంప్రదించగా, తాను మెనూ విషయం చూడటం లేదని, జూనియర్‌ అసిస్టెంట్‌ మల్లికార్జున్‌ చూసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. జూనియర్‌ అసిస్టెంట్‌ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావును సాక్షి వివరణ కోరగా, జూనియర్‌ అసిస్టెంట్‌ చెప్పిందే సమాధానమంటూ చెప్పుకొచ్చారు.

ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావు

గతంలోనూ అనేక ఆరోపణలు...

జూనియర్‌ అసిస్టెంట్‌ హవాపై ఆరోపణలు...

Advertisement
 
Advertisement
Advertisement