రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

ట్రాక్టర్‌–బైకు ఢీ, వ్యక్తి మృతి తల్లీకుమార్తెలపై రాడ్డుతో దాడి

పొన్నలూరు: ద్విచక్ర వాహనానికి పంది అడ్డం రావడంతో ఢీకొట్టి కిందపడి నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పొన్నలూరు మండల పరిధిలోని పాతశింగరబొట్లపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఓవీ రోడ్డుపై శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పైరెడ్డిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన నవీన్‌ తన కుటుంబంలోని చిన్నారికి ఆరోగ్యం బాగలేకపోవడంతో వైద్యం కోసం కందుకూరు వెళ్లాడు. వైద్యం చేయించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో పాతశింగరబొట్లపాలెం అడ్డరోడ్డు సమీపంలోకి రాగానే తన ద్విచక్ర వాహనానికి పంది అడ్డం వచ్చింది. ప్రమాదవశాత్తూ ఢీకొట్టడంతో బైకు అదుపుతప్పి కిందపడిపోయారు. నవీన్‌తో పాటు రెండేళ్ల చిన్నారి, మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.

సింగరాయకొండ: ట్రాక్టర్‌ – మోటారు సైకిల్‌ ఢీకొన్న ప్రమాదంలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం పంచాయతీ కొత్తపాలేనికి చెందిన మర్రి శ్రీనివాసులు (50) హైదరాబాద్‌లో బేల్దారి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వచ్చి గురువారం రాత్రి కరేడులో తన అక్కను కలిసేందుకు ఊళ్లపాలెం నుంచి కరేడు వెళ్తున్నాడు. జగనన్న కాలనీ సమీపంలోకి రాగానే ఎదురుగా వేరుశనగ గడ్డితో వస్తున్న ట్రాక్టర్‌ డోర్లు ప్రమాదవశాత్తూ శ్రీనివాసులు చాతికి తగిలి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని 108లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి గుంటూరు తరలించే క్రమంలో మార్గం మధ్యలోనే శుక్రవారం మృతి చెందాడు. మృతునికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ ఎస్సై మహేంద్ర తెలిపారు.

కుమార్తె పరిస్థితి విషమం

అద్దంకి: తల్లీకుమార్తెలపై ఎదురింటి వ్యక్తి రాడ్డుతో దాడి చేయడంతో కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన అద్దంకి మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెలనాటి లక్ష్మి, ఆమె మూడేళ్ల కుమార్తె భానుప్రియలపై ఎదురింట్లో ఉంటున్న వ్యక్తి రాడ్డుతో దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మి, భానుప్రియలకు తీవ్రగాయాలయ్యాయి. కుమార్తె పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలులోని వైద్యశాలకు తరలించారు. దాడికి కారణం తెలియరాకపోవడంతో ఈ సంఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement