సాక్షి, అమరావతి: దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించాల్సిందేనని వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దళితులు క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన వారి హోదా పెరగదని, వివక్ష తగ్గదని అన్నారు. సామాజిక వెనుకబాటు తనం అసలు పోదని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు దళితులకు అన్యాయం చేస్తుందని దళితులు బాధపడుతున్నారని అన్నారు. సామాజిక న్యాయం రాజ్యాంగ స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక మతంలోకి మారినంత మాత్రాన వివక్ష చూపి రిజర్వేషన్లు తీసేయడం సరికాదని వైఎస్సార్ సీపీ భావిస్తుందన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ సీపీ చాలా స్పష్టంగా ఉందన్నారు. అందుకే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామన్నారు. చంద్రబాబు కూడా ఈ విషయాలను మేనిఫెస్టోలో పెట్టారని, చంద్రబాబు బీజేపీలో ఉంటే ఒక రకంగా.. లేనప్పుడు మరో రకంగా మాట్లాడతారని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి దళితుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సుప్రీం తీర్పు తరువాత వైఎస్సార్ సీపీ స్టాండ్ ఏంటని అందరూ అడుగుతున్నారని, అంబేడ్కర్ ఆలోచనా విధానం అమలు చేయటడమే జగన్ లక్ష్యమని సురేష్ అన్నారు. ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా అదే కోణంలో ఆలోచన చేస్తున్నామని, రాజీ అనే పదం లేకుండా దళితుల పక్షాన ఉంటామని స్పష్టం చేశారు. దళిత క్రిస్టియన్లు ఎస్సీలు కాదని చెప్పడం సరైంది కాదన్నారు. మతం మారినంత మాత్రాన కులం పోదని చెప్పారు. ఎస్సీలపై అంటరానితనం, వివక్ష అలాగే కొనసాగుతోందని వివరించారు. దళిత క్రిస్టియన్లను బీసీలుగా గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుండటం సరికాదన్నారు. మతతత్వానికి అనుకూలంగా టీడీపీ వ్యవహరిస్తే అది వారినే దహించి వేస్తుందని ఆయన చెప్పారు.
వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్


