మార్కాపురం టౌన్: శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎస్‌వీకేపీ కళాశాల మైదానంలో కేటగిరి–2 పశుప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలను రైతులు, పశుపోషకులు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ ఎడ్లను ఉత్సాహపరుస్తున్నారు. మొత్తం 9 జతల ఎడ్లు పాల్గొనగా ఉదయం 3 జతలకు పోటీ నిర్వహించారు. ఎండ తీవ్రత దృష్ట్యా మిగిలిన 6 జతలకు సాయంత్రం తర్వాత ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు ఏర్పాట్లు చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు పోటీలు కొనసాగాయి.
టంగుటూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన స్థానిక టోల్ ప్లాజా వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక టోల్‌ప్లాజా హోటల్ వద్ద మెట్లు దిగి రోడ్డు దాటుతున్న జయవరానికి చెందిన బ్రహ్మారెడ్డిని ఒంగోలు వైపు నుంచి వచ్చిన బైకు అదుపుతప్పి ఢీకొట్టింది. బ్రహ్మారెడ్డితో పాటు బైక్‌పై ఉన్న గుడ్లూరు మండలం పాజర్ల గ్రామానికి చెందిన ఆదాం, యోగిలు కింద పడ్డారు. ముగ్గురికి గాయాలు కావడంతో చికిత్స కోసం హైవే అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు.
నాగులుప్పలపాడు/చీమకుర్తి రూరల్: జనాభా లెక్కల సేకరణలో సిబ్బంది అలసత్వం వహించకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆదేశించారు. గురువారం ప్రారంభమైన ఎన్యుమరేటర్ల ఫేజ్–1 శిక్షణ కార్యక్రమాన్ని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగణన 2026ను డిజిటల్ విధానంలో చేపడుతున్నామని, నిర్దేశిత వివరాలన్నీ సక్రమంగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రవీణ్ కుమార్, ఏఎస్‌వో కళ్యాణి, ఫీల్డు ట్రైనర్లు చంద్ర, అలేఖ్య పాల్గొన్నారు.
చీమకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్ల శిక్షణ సమావేశంలో డీఆర్‌ఓ ఓబులేసు మాట్లాడారు. మూడు రోజుల శిక్షణలో మెళకువలు తెలుసుకోవాలని సూచించారు. జనాభా లెక్కల ప్రక్రియ రెండు విడతల్లో చేపడుతున్నట్లు తెలిపారు. మొదటగా గృహాల గణన, రెండోసారి జనాభా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మే నెలలో గృహాల గణన ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య ఎంపీడీఓ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


