హనుమంత వాహనంపై రామచంద్రునిగా చెన్నకేశవస్వామి | - | Sakshi
Sakshi News home page

హనుమంత వాహనంపై రామచంద్రునిగా చెన్నకేశవస్వామి

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

మార్కాపురం టౌన్‌: శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం చెన్నకేశవస్వామి వారు శ్రీరామచంద్రుని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీపతి అప్పనాచార్యులు, అర్చక బృందం చెన్నకేశవస్వామి మూలవిరాట్‌ను, ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అర్చన, నివేదన, మంగళహారతి ఇచ్చారు. అనంతరం నాలుగు మాడవీధుల్లో స్వామివారి నగరోత్సవం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో మార్కాపురం పురవీధులు కిక్కిరిశాయి. కాగా, చెన్నకేశవ స్వామివారి మూలవిరాట్‌ను అర్చకులు ప్రత్యేకంగా చందనంతో అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి పల్లకి సేవలో వైఎస్సార్‌ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు దంపతులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఉత్సవాల సందర్భంగా కోలాట ప్రదర్శన, నృత్యం, వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

నేడు గరుడ వాహన సేవ

శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం గరుడ వాహనంపై స్వామివారు శ్రీమహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తులు నగరోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని ఈఓ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement