మార్కాపురం: పోషణ్ పక్వాడా కార్యక్రమంతో చిన్నారుల ఆరోగ్యానికి, భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని కలెక్టర్ విజయసునీత ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం పోషణ్ పక్వాడా కార్యక్రమాల ఉత్సవాన్ని ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ పద్మావతి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 15 రోజులపాటు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు స్వయం సహాయక సంఘాలతో, అంగన్‌వాడీ లబ్ధిదారులతో పోషణ్ ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. 6 సంవత్సరాల్లోపు చిన్నారులకు జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించేందుకు వంటల పోటీలు నిర్వహించాలన్నారు. పోషణ్ ప్రాముఖ్యతపై అమ్మమ్మలు, తాతయ్యలతో కథలు చెప్పడం ద్వారా సమాజ స్థాయిలో అనుభవాలు పంచుకోవచ్చని తెలిపారు. గర్భిణులు బాలింతలు, పిల్లల కోసం స్థానికంగా లభ్యమయ్యే పోషకాహార వంటకాల ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఎన్‌జీఓలు, ప్రజాప్రతినిధులను కలుపుకొని గ్రామీణ ప్రాంతాల్లో పోషణ్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించాలన్నారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా మలేరియా యూనిట్ అధికారి కె.రాహుల్, మెప్మా సిటీ మేనేజర్ ఎలిషా, ఐసీడీఎస్ సూపర్‌వైజరు నీలోఫర్, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ విజయ సునీత ఆదేశం


