● తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం
నాగులుప్పలపాడు: ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధించుకుందుకు ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఆశయాలను మనుధర్మానికి తాకట్టు పెట్టడం సరైన పద్ధతి కాదని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నారు. ఎమ్మార్పీఎస్ పురిటిగడ్డ ఈదుమూడి గ్రామాన్ని ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నేత గరటయ్య అధ్యక్షతన జరిగిన సభలో ప్రీతం మాట్లాడుతూ ఈదుమూడిలో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిందని గుర్తు చేశారు. చివరకు ఎస్సీ వర్గీకరణ సాధించుకొని ఈదుమూడి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అటువంటి ఉద్యమం ద్వారా ఏదిగిన స్వార్థ నాయకుడు బీజేపీ మాయలో పడి ఉద్యమాన్ని, ఆశయాలను మనుధర్మానికి తాకట్టు పెట్టడంతో పాటు ఈదుమూడి గ్రామం ఏమైనా ఉద్యమానికి రక్షణ కవచమా.. అని మాట్లాడటం దుర్మార్గమైన చర్యన్నారు. రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన తరుణంలో స్వార్థపరుడైన నాయకుడు ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఏ ఉద్యమ ఆశయాలను మనుధర్మానికి తాకట్టు పెట్టారో దానికి వ్యతిరేకంగా ఈదుమూడి నుంచే మరో ఉద్యమం ప్రారంభించి దేశ నలులమూలలా చాటి చెపుతామన్నారు. ఆ ఉద్యమానికి తాను అండగా నిలబడి ముందుకు తీసుకెళ్తానన్నారు. క్రైస్తవ మతం పుచ్చుకుంటే ఎస్సీ రిజర్వేషన్ ఉండదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకునే వరకు ఉద్యమిస్తామన్నారు. హిందువులకు తిరుపతి పుణ్యక్షేత్రంలా ఎలాగో మాదిగలకు పుణ్యక్షేత్రం ఈదుమూడిలో నిర్మించి తీరుతామన్నారు. అందుకు ఎమ్మార్పీఎస్ పుట్టిన రోజైన జూలై 7వ తేదీన దేశ నాయకులతో వచ్చి శంకుస్థాపన చేస్తామన్నారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న రిజర్వేషన్‌ను మన పిల్లలు పొందే విల్లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తోందని, దీంతో కష్టపడి చదువుకున్నా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, మానుకొండ శ్రీధర్, ఏటుకూరి విజయ్‌కుమార్, కొమ్మూరి సుధాకర్, సైమన్ పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: సన్నిహితంగా ఉంటున్న మహిళ దూరం పెట్టిందన్న కారణంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మార్కాపురం పట్టణంలోని ఇండో ఫ్యాక్టరీ వెనుక వైపు చక్రపాణి వీధిలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. బొమ్మిరెడ్డి చెన్నారెడ్డి కుమారుడు మల్లికార్జునరెడ్డి(36) ప్రైవేట్ డిష్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. కొద్ది రోజులుగా సదరు మహిళ దూరం పెట్టడంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పట్టణ ఎస్సై సైదుబాబు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


