పెద్దదోర్నాలలో పిచ్చికుక్క స్వైర విహారం | - | Sakshi
Sakshi News home page

పెద్దదోర్నాలలో పిచ్చికుక్క స్వైర విహారం

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

ముగ్గురు చిన్నారులతో పాటు మరొకరికి గాయాలు

పెద్దదోర్నాల: పిచ్చికుక్క స్వైర విహారం చేయటంతో ముగ్గురు చిన్నారులతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పెద్దదోర్నాలకు చెందిన చిన్నారులు కళ్యాణి, ధరణి, ఐనముక్కలకు చెందిన శ్రీలక్ష్మిలతో పాటు ఓ రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి మౌళాలి తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు గుంటూరు రోడ్డులోని ఐడియా షోరూం ఎదురుగా తల్లిదండ్రులు కాశీరాములతో కలిసి షాపింగ్‌కు వచ్చిన కళ్యాణి, దిబ్బయ్య కుమార్తె ధరణిలు, ఐనముక్కలకు చెందిన వెంకట రమణ కుమార్తె శ్రీలక్ష్మిలను పిచ్చికుక్క దాడి చేయటంతో వారిద్దరి చేతులు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి పక్కనే ఉన్న మరో ప్రాంతానికి వెళ్లిన పిచ్చికుక్క రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి మౌళాలిపై దాడి చేసి కాలిపై కొరకటంతో పంటిగాట్లు బలంగా పడ్డాయి, గాయపడిన వీరిని స్థానికులు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా క్షతగాత్రులకు యాంటి రేబిస్‌ వాక్సిన్‌లు వేయటంతో పాటు ప్రథమ చికిత్స చేశారు. అధికారులు స్పందించి గ్రామంలో సంచరిస్తున్న పిచ్చికుక్కను బంధించాలని కోరుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement