వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతున్న ఆలయం పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
మార్కాపురం టౌన్: చారిత్రక ప్రసిద్ధి చెందిన మార్కాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వివిధ రంగులతో విద్యుత్ దీపాలను అలంకరించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈనెల 1 నుంచి నిర్వహిస్తున్నారు. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చెన్నకేశవస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మార్కాపురంతోపాటు పరిసర ప్రాంతాల్లో, కర్నూలు, నంద్యాల, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ప్రతిరోజూ ఒక వాహనంపై ప్రత్యేక అలంకారంలో నాలుగు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ గొలమారి శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. వాహనాల్లో భాగంగా పొన్న వాహనం, హనుమంత వాహనం, గజ వాహనాలకు పగలు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వాహనం ముందు భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ వేషధారణల మధ్య స్వామివారికి నగరోత్సవం జరుగుతుంది. రథోత్సవంలో స్వామివారిని దర్శించుకోవడంతోపాటు భక్తులు రథాన్ని లాగి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు మార్కాపురం పట్టణానికి చేరుకుంటారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నదానం చేస్తారు.


