పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడండి | - | Sakshi
Sakshi News home page

పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడండి

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడండి ● ఎస్‌పీ హర్షవర్ధన్‌రాజు వెలిగొండను సందర్శించిన మంత్రి రామానాయుడు జనగణన విధులపై కార్యదర్శుల నిరసన గళం ● రెవెన్యూ అధికారుల ఉత్తర్వ్లుపై మండిపాటు

● ఎస్‌పీ హర్షవర్ధన్‌రాజు

ఒంగోలు టౌన్‌: వేసవి సెలవుల్లో పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ వీ హర్షవర్ధన్‌రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్ధులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. సరదాల కోసం పిల్లలు, యువకులు, గ్రామాలు, పట్టణాల శివార్లలోని కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్దకు ఈతలకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. గతంలో ఇలాంటి ప్రమాదకర జలాశయాల్లో పలువురు మృత్యువాత పడి కుటుంబాలకు తీరని విషాదం మిగిల్చిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. ఈతకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సరదాగా వెళ్లిన పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెరువుల్లో, కొలనుల్లో, కాలువల్లో ఈత కొట్టే ముందు ఈత తెలిసిన వారు కూడా నీటి లోతును కర్రసాయంతో ముందుగా పరిశీలించుకోవాలన్నారు. లోతు తక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే ఈత, స్నానం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిధిలో చెరువులు, కొలనులు, జలపాతాలు, నీటి కుంటలు, ఏరుల వద్దకు ఎవరూ ఈతకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈత ప్రదేశాల్లో నీటి లోతును తెలుపుతూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం సంభవించిన వెంటనే 112 నంబరుకు డయల్‌ చేయాలని లేదా సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

పెద్దదోర్నాల: మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వద్ద ఉన్న కొల్లంవాగుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రెండవ సొరంగం ద్వారా ప్రత్యేక వాహనంలో కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల వద్దకు చేరుకున్నారు. అనంతరం గంటవానిపల్లె వద్ద జరుగుతున్న ఫీడర్‌ కెనాల్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సొరంగ నిర్మాణ పనులు, ఫీడర్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్‌ విజయ సునీత, సీఈ, రమేష్‌, ఎస్‌ఈ అబూతాలిం, డీఈ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

కనిగిరిరూరల్‌: జనగణన విధులకు పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై పంచాయతీ కార్యదర్శుల సంఘం తీవ్రంగా మండిపడుతోంది. ఈమేరకు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేయనున్నట్లు కనిగిరి పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘ నాయకులు మాట్లాడుతూ పట్టణాల్లో వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సచివాలయ సిబ్బంది ఉన్నా.. వారిని పక్కన పెట్టి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులకు జనగణన బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, డోర్‌టు డోర్‌ చెత్త సేకరణ, స్వామిత్వ సర్వే, యూనిఫైడ్‌ మిస్సింగ్‌ డేటా, జల సంరక్షణ మాసం, నీటి ఎద్దడి నివారణ చర్యలు, గ్రామ పరిపాలన బాధ్యతల నిర్వహణ తదితర అనేక రకాల విధులతో ఒత్తిడిల్లో ఉన్న తమను కావాలని జనగణన విధులకు కేటాయించడం సమంజసం కాదన్నారు. జనగణన విధులు రెవెన్యూ సిబ్బందికి కేటాయించకుండా తమనే ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నిస్తే..‘పంచాయతీ కార్యదర్శులకు పనిలేదని...వీఆర్వోలకు, వీఆర్‌ఏలకు పని ఉందని’ రెవెన్యూ శాఖ అధికారులు వ్యాఖ్యానించడం తీవ్ర బాధాకరమన్నారు. జిల్లా అధికారులు తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని జనగణన విధుల్లో నుంచి పంచాయతీ కార్యదర్శులను తప్పించాలని, తాము చేస్తున్న గ్రామాల్లోనే విధులు కేటాయించాలని సంఘ నాయకులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement