ప్రయాణికులకు మెరుగైన సేవలందించండి | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు మెరుగైన సేవలందించండి

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

దక్షిణ మధ్య రైల్వే జీఎంకు విన్నవించిన ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ నాయకులు

మార్కాపురం రూరల్‌: మార్కాపురం రోడ్‌ రైల్వేస్టేషన్‌ను అమృత్‌ భారత్‌ పథకంలో చేర్చినా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందటం లేదని ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఓరుగంటి మల్లిక్‌, ఆర్‌కేజే నరసింహలు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ సుధీష్ణ సేన్‌కు విన్నవించారు. మంగళవారం మార్కాపురం రోడ్‌ రైల్వేస్టేషన్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఆమెను కలిసి పలు సమస్యలను జీఎం దృష్టికి తెచ్చారు. రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రమైనప్పటికీ అందుకు తగినట్లుగా రైళ్లు, స్టేషన్‌లో వసతి సౌకర్యాలు లేవని, వాటిని మెరుగు పరచాల్సి ఉందన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు కర్నాటక, హైదరాబాద్‌, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని, వారికి తగినట్లుగా రాత్రి సమయంలో బస చేసేందుకు ప్రయాణికులకు వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. మార్కాపురం నుంచి గుంటూరుకు మధ్యాహ్నం సమయంలో ఒక రైలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే చర్లపల్లి–మార్కాపురం రైలును ప్రతిరోజు నడపాలని, కాచిగూడ–నడికుడి ప్యాసింజర్‌ను న్యూపిడుగురాళ్ల, శావల్యాపురం మీదుగా మార్కాపురం వరకు పొడిగించాలని కోరారు. కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను డైలీ సర్వీసుగా మార్చాలని కోరారు. గుంటూరు–ఔరంగాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను షిర్డీ వరకు పొడిగించాలని, గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను తిరువణ్ణామలై మీదుగా తిరుచిరాపల్లి వరకు పొడిగించాలని విన్నవించారు. వారితో పాటు నరసింహా చార్యులు, రైల్వే పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement