జువ్వలదిన్నె హార్బర్‌లో సోనాబోట్ల అపహరణపై మత్స్యకారుల సమావేశం నిందితులను సమావేశంలో నిలబెట్టిన పెద్దలు సూత్రధారులెవరో చెప్పాలని మత్స్యకారుల నిలదీత సమావేశానికి హాజరైన 164 గ్రామాల మత్స్యకారులు
సింగరాయకొండ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు కరైకల్‌కు చెందిన బోట్లను వదిలేసిన వ్యవహారంలో తెరవెనుక సూత్రధారులు ఎవరో తేల్చేందుకు 164 గ్రామాల మత్స్యకారులు పాకలలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్ధరాత్రి వరకు హైడ్రామా నెలకొంది. గత నెల నాలుగో తేదీన జువ్వలదిన్నె హార్బర్‌లో మైరెన్ పోలీసుల రక్షణలో ప్రకాశం జిల్లా మత్స్యకారులు పట్టుకున్న తమిళనాడు బోట్లు మాయమయ్యాయి. ఈ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల పంచాయతీ పోతయ్యగారిపట్టపుపాలెంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన సమావేశమయ్యారు. నాలుగు జిల్లాల నుంచి బస్సులు, వ్యాన్‌లు, మోటారు సైకిళ్లపై వేలాదిగా తరలివచ్చారు. ఈ సంఘటన జరిగిన రోజు ఘటనకు ప్రధాన కారకులైన నెల్లూరు జిల్లా ఇస్కపల్లి మత్స్యకార గ్రామానికి చెందిన తోటయ్య, కొత్త బంగారుపాలెంకు చెందిన జాలిరెడ్డి, పాతపాలెంకు చెందిన శెట్టిలను సమావేశంలో నిందితులుగా నిలబెట్టారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించాలని మత్స్యకార పెద్దలు ఆదేశించారు. దీనికి ఆ ముగ్గురు ‘‘తాము తప్పు చేశామని బహిరంగంగా ప్రకటించారు’’. అయితే ఎవరు చెబితే వదిలేశారో చెప్పడం లేదు. ఈ ఘటనకు వెనకాల ఎవరు ప్రధానపాత్ర పోషించారు, ఏం జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కొంతమంది మత్స్యకార కాపులు జరిమానాతో సరిపెడదామని అంటుండగా ఈ ఘటనకు వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరో చెప్పాలని, ఎంత మొత్తం చేతులు మారిందో తెలపాలని సమావేశానికి హాజరైన సింహభాగం మత్స్యకార కాపులు పట్టుబట్టారు.
ఒక్కొక్కరిది ఒక్కో మాట:
సోనాబోట్ల అపహరణలో ప్రధాన నిందితులైన ఇస్కపల్లికి చెందిన తోటయ్య, కొత్త బంగారుపాలేనికి చెందిన జాలిరెడ్డి, పాతపాలేనికి చెందిన శెట్టి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. ఒక ముద్దాయి ఇటీవల లోకేష్ పర్యటన సందర్భంగా హార్బర్‌లో బోట్లు అడ్డంగా ఉన్నాయని, వాటిని పక్కకు జరపాలని కావలి సీఐ వాటిని తీసుకుని వెళ్లటానికి అనువుగా ఏర్పాటు చేశాడని చెప్పగా.. మరొకరు ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. మూడవ వ్యక్తి తోటయ్య మాత్రం తనకు తెలుగు వచ్చినప్పటికీ ఇతర భాషలో మాట్లాడే ప్రయత్నం చేయటంతో సీఐతో మాట్లాడటానికి తెలుగు వచ్చుకానీ ఇప్పుడు మాత్రం తెలుగు రాదా అని మత్స్యకారులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సూత్రధారులు ఎవరో చెప్పాల్సిందేనంటూ సమావేవానికి హాజరైన మత్స్యకార పెద్దలు పట్టుబట్టారు. రాత్రి గం.11.30 సమయంలో ఇస్కపల్లికి చెందిన తోటయ్య చివరకు నోరువిప్పాడు. బోట్లు వదిలేసేందుకు తెరవెనుక ఉన్న వ్యక్తి బీద మస్తానరావేనని చెప్పడం సంచలనంగా మారింది.
ప్రాణాలకు తెగించి పోరాడాం..
మత్స్యకార పెద్దలు 8 నెలల నుంచి తాము ఏవిధంగా ప్రాణాలకు తెగించి సోనాబోట్లను అదుపులోకి తీసుకుందీ వివరించారు. వాటిని జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచి వాటి కాపలా బాధ్యతను ఇస్కపల్లి, కొత్త బంగారుపాలెం, తాటిచెట్లపాలెం, పాతపాలెం మత్స్యకార పాలెంలకు అప్పగించి ముగ్గురిని కాపలాగా ఉంచామన్నారు. అంతేకాక ఈ బోట్లను విడిపించటానికి సోనాబోట్ల యజమానులు ఒక్కో బోటుకు రూ.15 లక్షలు ఇస్తామన్నా తాము వదల్లేదన్నారు. ఈ ఘటనకు ఆ నాలుగు మత్స్యకార గ్రామాల పెద్దలు కూడా బాధ్యత వహించాలని ప్రకటించగా వారు కూడా అందుకు సమ్మతించారు. ఎన్నో సంవత్సరాలుగా సోనాబోట్ల కారణంగా ఆర్థికంగా నష్టపోయామని తాము తెగించి సమైక్యంగా బోట్లను అదుపులోకి తీసుకుంటే ఈ విధంగా చేశారని మత్స్యకార పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు తెరవెనుక కారకులు తేలే వరకు అర్ధరాత్రైనా సమావేశం కొనసాగుతుందని మత్స్యకార పెద్దలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా సుమారు 100 మంది వలంటీర్లను ఏర్పాటు చేసి సమావేశం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మొదట పోలీసులు, విలేకరులకు అనుమతి ఉండదని ప్రకటించినప్పటికీ తరువాత విలేకరులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.


