న్యూస్‌రీల్
మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం స్పందించకపోవడంతో తక్కువ ధరకే అమ్మకాలు ఇదే అదునుగా రెచ్చిపోతున్న దళారులు ఎకరాకి 50 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు నేటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం
ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉంది. ధరలు మాత్రం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ధాన్యం అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రకటనకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన లేకుండా ఉంది. మొక్కుబడిగా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అయితే అవి ఏరకంగానూ అన్నదాతకు మేలు చేయడంలేదు. దిక్కుతోచని స్థితిలో వచ్చిన రేటుకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఇదే అదునుగా దళారులు ధరలో కోత పెడుతున్నారు.
రైతులను నిలువునా ముంచుతున్న కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోంది. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పంపిణీలో విఫలమైన ప్రభుత్వం చివరకు రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వం ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు బయట మార్కెట్లల్లో ధాన్యం అమ్ముకుంటున్నారు. మాజీ సీఎం జగనన్న ప్రభుత్వంలో అన్ని రకాల రైతులకు మద్దతు ధర కల్పించారు.
– రాయిండ్ల వెంకట నారాయణ, టంగుటూరు మండలం.
కందుకూరు:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41,467 మంది వరిసాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 16,704 హెక్టార్లలో, రబీలో 24,647 హెక్టార్లలో వరిసాగు చేశారు. అత్యధికంగా దర్శి నియోజకవర్గం పరిధిలోని దర్శి, ముండ్లమూరు, కురిచేడు, తాళ్లూరు, కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ, టంగుటూరు, అలాగే త్రిపురాంతకం, పామూరు, నాగులుప్పలపాడు, చీమకుర్తి, ఒంగోలు తదితర మండలాల్లో పెద్ద మొత్తంలో వరి సాగు చేశారు.
మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు
సాధారణంగా పంట చేతికొచ్చే సమయంలో మద్దతు ధరలు కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వం విధి. జిల్లాలో మొక్కుబడిగా అరకొరగా, ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వివిధ సాకులు చూపుతూ పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తక్కువ రేట్లకు దళారులకు తెగనమ్ముకున్నారు.
రెచ్చిపోతున్న దళారులు..
ధాన్యం సేకరణలో దళారుల ఇష్టారాజ్యంగా మారింది. ఒకపక్క మద్దతు ధరలకు కొనుగోలు చేయకపోగా తేమ శాతం పేరుతో మరో దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2389ల మద్దతు ధర ప్రకటించింది. దీని ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1800ల వరకు ధర చెల్లించాల్సి ఉంది. కానీ దళారులు ప్రస్తుతం రూ.1500 కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇక మిగిలిన కామన్ గ్రేడ్ రకాల ధాన్యానికి క్వింటాకు రూ.2369 మద్దతు ధర ఉండగా 75 కేజీల బస్తాకు రూ.1780ల వరకు ధర ఇవ్వాలి. కానీ దళారులు మాత్రం రూ.1200 నుంచి రూ.1400లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పైగా తేమ శాతం పేరుతో బస్తాకు 4 కేజీల వరకు తరుగు తీసేస్తున్నారు. దీంతో రైతులు అటు ధరలు లేక, ఇటు తేమ శాతం పేరుతో రెండు విధాలా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా నేటికీ ఒక్క ధాన్యం సేకరణ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం దారుణం. తీరా రైతులు ధాన్యం మొత్తం అమ్ముకున్న తరువాత ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రకటనలు ఇస్తుండడం విడ్డూరంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన పెట్టుబడి ఖర్చులు
వరి సాగులో పెట్టుబడి ఖర్చులు అంతకంతకు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు, సేద్యపు ఖర్చులు, ఎరువులు, కూలీలు, కోతలు ఇలా అన్ని రకాల ఖర్చు పెరగడంతో ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి కింద ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. పెట్టుబడి పెరిగినా దిగుబడి బాగా వచ్చిందని సంబరపడుతున్న తరుణంలో ధరలు లేకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలకు ముందుతో పోల్చితే ప్రస్తుతం బస్తాకు రూ.500ల వరకు ధర తగ్గిందని రైతులు అంటున్నారు. ఈ విధమైన ధరలతో చేసిన శ్రమకు, పెట్టిన పెట్టుబడులకు ఏమాత్రం ఫలితం లేకుండా పోతుందంటున్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో దళారులకు విక్రయిస్తున్నామని చెప్తున్నారు.
ధర వర్రీ!
కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం, గుడ్లూరు, కందుకూరు మండలాల్లో రబీ సీజన్‌లో ప్రధానంగా వరి పంట సాగు చేస్తుంటారు. కందుకూరు మండలంలో అత్తాకోడళ్ల చెరువుల కింద మాచవరం, మోపాడు, కొండముడుసుపాలెం, పాలూరు–దొండపాడు వంటి ప్రాంతాల్లో, రాళ్లపాడు ప్రాజెక్టు కింద లింగసముద్రం, గుడ్లూరు మండలాల్లోని గ్రామాల్లో పంటను సాగు చేస్తారు. అయితే వరిసాగు ఆశాజనకంగా ఉండడం లేదనే కారణంతో ఈ ఏడాది కొంత మేర మాత్రమే రైతులు వరిని సాగు చేశారు. ప్రధానంగా రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఆయకట్టులో కొన్ని గ్రామాల్లో వరి సాగైంది. సాగైన ప్రాంతాల్లో ఈ ఏడాది రైతులు ఊహించిన దానికంటే దిగుబడులు అధికంగా వచ్చాయి. సాధారణంగా సన్నం రకాల ధాన్యం ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తే రైతులు సంతోషంగా ఉంటారు. అలాంటి ఈ ఏడాది ఎకరాకి 50 బస్తాల నుంచి 60 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. అన్ని ప్రాంతాల్లోను ఒకటీ రెండు బస్తాలు అటూఇటుగా దిగుబడి వచ్చింది. ప్రస్తుతం గత 20 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా వరికోతలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దిగుబడులు చూసి ఆశ్చర్యంతో పాటు, సంతోషంతో సంబరపడుతున్న రైతులకు ధరలు మాత్రం షాక్ ఇస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేసే నాథుడు కరువయ్యాడు. మిల్లర్లు దళారులను అడ్డుపెట్టుకుని ధరలు తగ్గించి నిలువు దోపిడీ చేస్తున్నారు.


