సోనా సంగతి తేల్చేద్దాం! | - | Sakshi
Sakshi News home page

సోనా సంగతి తేల్చేద్దాం!

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

తమిళ జాలర్ల ఆగడాలతో విసిగిపోయిన స్థానిక మత్స్యకారులు ఎనిమిది నెలల క్రితం ప్రాణాలకు తెగించి పట్టుకున్న నాలుగు సోనాబోట్లను జువ్వలదిన్నె హార్బర్‌లో భద్రపరిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందంతో కూటమి ప్రభుత్వ పెద్దలు దొంగచాటుగా సోనాబోట్లను తరలించడంపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులెవరో తేల్చాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు జిల్లాల పరిధిలోని 160 మత్స్యకార గ్రామాలకు చెందిన వారు భవిష్యత్‌ కార్యాచరణకు నేడు పాకలలో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.

కరైకల్‌ బోట్ల మాయంపై మత్స్యకారుల సమావేశం

8 నెలల కిందట ప్రాణాలు లెక్కచేయకుండా సోనాబోట్ల స్వాధీనం

జువ్వలదిన్నె హార్బర్‌లో మైరెన్‌ పోలీసుల రక్షణలో బోట్లు

అధికార టీడీపీ పెద్దల చీకటి ఒప్పందంతో గుట్టు చప్పుడు కాకుండా బోట్ల తరలింపు

రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల ఆగ్రహం

బోట్ల మాయంపై పాకలలో సమావేశం నేడు

తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని 160 మత్స్యకార గ్రామాల నుంచి హాజరు

సమావేశానికి అనుమతి నిరాకరించిన పోలీసులు

మా సమావేశానికి మీ అనుమతి ఎందుకంటున్న మత్స్యకారులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రతో జువ్వలదిన్నె హార్బర్‌ నుంచి కొద్దిరోజుల క్రితం తప్పించుకుపోయిన పాండిచ్చేరి (కరైకల్‌)కు చెందిన సోనాబోట్లు సముద్ర తీరప్రాంత నిబంధనలకు విరుద్ధంగా తీరానికి అతి సమీపంలో చేపల వేట సాగిస్తూ ఈ ప్రాంత మత్స్యకారుల వలలు తెంచుతూ, మత్స్య సంపదను దోచుకుంటూ ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి రావటంతో కొద్దిరోజులుగా మత్స్యకారులు ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నారు.

జువ్వలదిన్నె హార్బర్‌లో సోనాబోట్ల నిర్బంధం

కొద్ది సంవత్సరాలుగా పాండిచ్చేరి (కరైకల్‌) ప్రాంతానికి చెందిన సోనాబోట్లు తీరానికి అతి సమీపంలో చేపల వేట సాగిస్తూ లక్షలాది రూపాయల విలువైన ఈ ప్రాంత మత్స్యకారుల వలలు ధ్వంసం చేయటమే కాక లక్షలాది రూపాయల మత్స్యసంపదను కొల్లగొడుతూ ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాయి. దీనిపై గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కొంతవరకు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సోనాబోట్ల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేక మత్స్యకారులు సుమారు 8 నెలల క్రితం కలిసికట్టుగా ఒక సైన్యంలా ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట సాగిస్తున్న సోనాబోట్లపై దాడులు చేసి నాలుగు బోట్లను నెల్లూరు జిల్లా పరిధిలోని జువ్వలదిన్నె హార్బర్‌లో మైరెన్‌ పోలీసుల పర్యవేక్షణలో భద్రపరిచి పాండిచ్చేరికి చెందిన మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రశాంతంగా చేపల వేట

సోనాబోట్ల నిర్బంధంతో మత్స్యకారులు నిరాటంకంగా చేపల వేట సాగించారు. కానీ గత వారం కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రతో హార్బర్‌లో నిర్బంధంలో ఉన్న సోనాబోట్లను పాండిచ్చేరి మత్స్యకారులు ఈ ప్రాంత మత్స్యకారులకు తెలియకుండా విడిపించుకుని వెళ్లిపోయారు. సోనాబోట్లను తీసుకెళ్తున్నారన్న సమాచారం తెలియటంతో అప్రమత్తమైన మత్స్యకారులు వాటిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేసినా అవి తప్పించుకునిపోయాయి.

ఆగ్రహించిన మత్స్యకారులు

జువ్వలదిన్నె హార్బర్‌లో మైరెన్‌ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న నాలుగు బోట్లను కరైకల్‌ మత్స్యకారులు తరలించుకుపోవటంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో భాగస్వాములైన మూడు గ్రామాలకు చెందిన ముగ్గురు కాపులను నిర్బంధించి ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారో తెలపాలని డిమాండ్‌ చేశారు.

మత్స్యకారుల సమావేశం

కూటమి ప్రభుత్వం తమకు చేసిన మోసంపై ఆగ్రహించిన మత్స్యకారులు ఈనెల 6వ తేదీ సోమవారం పాకల పంచాయతీలోని పోతయ్యగారి పట్టపుపాలెంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయటానికి తీర్మానం చేశారు. ఇటీవల సీఐ సీహెచ్‌ హజరత్తయ్య, ఎస్సై బీ మహేంద్ర పోతయ్యగారి పట్టపుపాలెంకు వెళ్లి సమావేశం ఎప్పుడు పెట్టుకున్నారో చెప్పాలని మత్స్యకారులపై ఒత్తిడి చేశారు. దీనిపై మత్స్యకారులు తాము ఇంకా సమావేశం తేదీ నిర్ణయించలేదని తరువాత చెబుతామని చెప్పారు. తరువాత మత్స్యకారులు సమావేశం తేదీ నిర్ణయమైందని ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. పోలీసులు మాత్రం ఈ సమావేశానికి ఎటువంటి అనుమతులు ఇవ్వమని తేల్చిచెప్పారు. మత్స్యకారులు కూడా అదే పంతంతో తాము ఏర్పాటు చేసేది రాజకీయ సమావేశం కాదని, ఇది కేవలం కుల సమావేశం అని, ఈ సమావేశానికి పోలీసులకు, మీడియాకు అనుమతి ఉండదని తెగేసి చెప్పారు. ఈ సమావేశానికి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన సుమారు 6 వేలకుపైగా మత్స్యకారులు హాజరవుతారని తెలిపారు. దీనిపై పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న మత్స్యకారుల గ్రామాల్లో కూటమి ప్రభుత్వ పెద్దల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని, సానుకూలంగా సమస్య పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement