సొమ్ము ఒకరిది.. సోకొకరిది | - | Sakshi
Sakshi News home page

సొమ్ము ఒకరిది.. సోకొకరిది

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

మర్రిపూడి: మంత్రి స్వామి ఆదేశాలతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను అధికారులు హడావుడిగా ప్రారంభించడంపై దళితులు భగ్గుమన్నారు. మేం ఏర్పాటు చేసిన విగ్రహాలను మాకు చెప్పకుండా మీరెలా ప్రారంభిస్తారంటూ అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళితే. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రాంవిగ్రహాలను రూ.15 లక్షలు వెచ్చించి వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విగ్రహాలను దానం చేశారు. దీంతో దాతల సహకారంతో తహసీల్దార్‌ కార్యాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల కోడ్‌ రావడంతో విగ్రహాల ఆవిష్కరణ ఆగిపోయింది. ఆ తరువాత వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరించాలని గ్రామస్తులు భావించారు. అయితే వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ప్రతిష్టను ఎలాగైనా దెబ్బతీయాలన్న కుట్రతో మంత్రి స్వామి పన్నాగం పన్నారు. వైఎస్సార్‌ సీపీ, టీడీపీకి చెందిన రెండు వర్గాల దళితులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పిలిపిచించిన కొండపి సీఐ సోమశేఖర్‌ చర్చలు జరిపారు. విగ్రహాలను రెండు వర్గాల నాయకులు ఇప్పుడు ఆవిష్కరించేది లేదని ఒప్పందం చేసుకున్నారు. రెండు వర్గాలతో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేయించి పంపించారు. ఈ లోగా ఎస్సై రమేష్‌బాబు, సీఐ సోమశేఖర్‌ ఎక్కడ వారిని అక్కడ చెదరగొట్టారు. వెంటనే తహహీల్దార్‌ జనార్దన్‌ తన సిబ్బందితో కలిసి వారి చేతుల మీదుగా విగ్రహాలను పూలమాలలు వేసి ఆవిష్కరించారు. అంతకుముందే పోలీసులు ఇరువర్గాల పై బైండవర్‌ కేసు నమోదుచేశారు.

అధికారుల తీరుపై ఆగ్రహం

రెండేళ్ల క్రితం వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు చందాల రూపంలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను మంత్రి స్వామి ఆదేశాలకు అధికారులు పోలీస్‌ బందోబస్తు మధ్య ఆవిష్కరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. దాతల సహకారంతో మేం ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను మీరెలా ప్రారంభిస్తారని, మీరు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అధికారులను ప్రశ్నించారు. ఇరువర్గాలను పిలిచి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మీరెలా ప్రారంభిస్తారని తహసీల్దార్‌ జనార్దన్‌ను దళితులు నిలదీశారు. దీంతో తహసీల్దార్‌ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. రెండేళ్ల క్రితం విగ్రహాలు పెట్టి ప్రారంభించకుండా గొడవలు జరుగుతాయనే తానే ప్రారంభించానని పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన దళితులు మా డబ్బులతో మీరు, టీడీపీ నేతలు దండలు వేసి ఆవిష్కరించడం ఏంటని ప్రశ్నించారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని పొదిలి– టంగుటూరు ఆర్‌అండ్‌బీ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని సర్దిచెప్పారు. ఆందోళనకు దిగిన వారిలో దళిత నాయకులు గురిజాల యోబు, గురిజాల రమేష్‌,, గురిజాల బుజ్జి, గురిజాల యేబేలు, దాసరి సాల్మన్‌, దాసరి ఇజ్రాయిల్‌, గండి బుజ్జి, గురిజాల పేతురు, దాసరి చిన్నా, ఓండ్రు ఓబద్య, ఒనుకూరి రవి, ఒనుకూరి ప్రసాదు, ఓ సూర్యం, నేలపాటి బెనర్జి తదితరులు ఉన్నారు.

రూ.15 లక్షలతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలు ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

ఎన్నికల కోడ్‌తో నిలిచిన విగ్రహ ఆవిష్కరణలు

రెండేళ్లుగా పట్టించుకోని కూటమి నాయకులు

మంత్రి ఆదేశాలతో హడావుడిగా ప్రారంభించిన అధికారులు

అధికారుల ఆవిష్కరణలపై భగ్గుమన్న దళితులు

రహదారిపై బైఠాయింపు, నిలిచిన రాకపోకలు

మంత్రి, అధికారుల తీరుపై దళితుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement