అద్దంకి రూరల్: అద్దంకిలోని దుస్తుల దుకాణంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే..అద్దంకి మెయిన్ బజారులో ఫ్యాషన్ షోరూం నిర్వాహకులు శనివారం రాత్రి దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో షాపు వెనుకవైపు భాగం నుంచి పైకి ఎక్కి పైకప్పు రేకులను వంచి దుండగులు లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్‌లోని నగదు అపహరించారు. ఆదివారం ఉదయం షాపు నిర్వాహకులు వచ్చి చూడగా క్యాష్ కౌంటర్‌లో నగదు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సుబ్బరాజు సంఘటన స్థలాని వెళ్లి పరిశీలించారు. ఒంగోలు నుంచి క్లూస్‌టీం సీఐ భీమానాయక్, సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో షోరూమ్‌లోని సీసీ ఫుటేజ్ పరిశీలించి వేలుముద్రలు సేకరించారు. పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణంలోనే దొంగతనం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుమారు రూ.2లక్షల నగదు చోరీకి గురైందని నిర్వాహకులు తెలిపారు.


