గ్యాస్‌ ఏజెన్సీ ఎదుట హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ఏజెన్సీ ఎదుట హైడ్రామా

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

మార్చి 14న గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారికి డెలివరీ చేయని వైనం రేపు మాపు అంటూ తిప్పుతుండడంతో తిరగబడిన ప్రజలు నగరంలో ఒక రెస్టారెంటుకు బ్లాక్‌లో విక్రయించినట్లు ప్రచారం రంగంలోకి దిగిన పోలీసులు మీ సంగతి తేలుస్తామంటూ మీడియా ప్రతినిధులకు నిర్వాహకుల బెదిరింపు

ఒంగోలు టౌన్‌: గ్యాస్‌ సరఫరా విషయంలో నగరంలోని అన్నవరప్పాడు వద్ద ఉన్న గ్యాస్‌ ఏజెన్సీ వద్ద హైడ్రామా నెలకొంది. నగరంలోని సంతపేట, అన్నవరప్పాడు మొదటిలైనులో పూర్ణిమ గ్యాస్‌ ఏజెన్సీ వుంది. ఇక్కడ మార్చి 14న కొందరు వినియోగదారులు గ్యాస్‌ బుక్‌ చేసుకున్నారు. గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారులకు కంపెనీ నుంచి వెంటనే మెసెజ్‌ కూడా వచ్చింది. అయితే అప్పటి నుంచి నేటి వరకు గ్యాస్‌ డెలివరీ చేయలేదు. కొందరు వినియోగదారులు ఏజెన్సీ నిర్వాహకుడి వద్దకు వెళ్లి వాకబు చేస్తే రేపు రండి ఎల్లుండి రండంటూ తిప్పుకుంటున్నారు. దీంతో విసుగు చెందిన వినియోగదారులు కొందరు శనివారం ఏజెన్సీ వద్దకు చేరుకొని నిర్వాహకులను నిలదీశారు. గ్యాస్‌ స్టాక్‌ రాలేదని, వెంటనే ఇస్తామని బుకాయించే ప్రయత్నాలు చేయడంతో వినియోగదారులు వాదనకు దిగారు. దీంతో ఏజెన్సీ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం తెలిసిన పోలీసులు ఏజెన్సీ వద్దకు చేరుకొన్నారు. వినియోగదారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా నిర్వాహకులు గ్యాస్‌ డెలివరీ ఎప్పుడు చేస్తారో నిర్దిష్టంగా చెప్పకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఏజెన్సీని రద్దు చేయాలని, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నల్లబజారుకు తరలిన గ్యాస్‌...

గత నెల 14న బుక్‌ చేసుకున్న వినియోగదారులకు సంబంధించిన గ్యాస్‌ సిలిండర్లను దొడ్డి దారిన నల్లబజారుకు తరలించినట్లు కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నగరంలోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌కు సదరు గ్యాస్‌ సిలిండర్లను అమ్ముకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఏజెన్సీ అక్రమాలపై ఇప్పటికే పలువురు వినియోగదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి ఏజెన్సీకి సంబంధించిన వినియోగదారులకు గ్యాస్‌ సరఫరా చేసే బాధ్యతను నగరంలోని మరో రెండు గ్యాస్‌ ఏజెన్సీలకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే గత నెల 14వ తేదీకి ముందు బుక్‌ చేసుకున్న వినియోగదారులకు మాత్రం పూర్ణిమ గ్యాస్‌ ఏజెన్సీ సరఫరా చేయాల్సి వుంది. ఇప్పుడు ఈ విషయంలోనే పూర్ణిమా ఏజెన్సీ నిర్వాహకులకు వినియోగదారులకు మధ్య వాదన జరిగినట్లు సమాచారం.

మీడియాకు బెదిరింపులు..

గ్యాస్‌ వినియోగదారులకు, నిర్వాహకులకు మధ్య వాదన జరుగుతున్నట్లు సమాచారం తెలుసుకున్న కొందరు మీడియా ప్రతినిధులు ఏజెన్సీ వద్దకు చేరుకున్నారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులు మీడియా ప్రతినిధులతో వాదనకు దిగారు. మీ సంగతి తేలుస్తామంటూ బెదిరింపులకు దిగడంతో అక్కడకు వచ్చిన వినియోగదారులు విస్మయానికి గురయ్యారు. ఎవరి అండ చూసుకొని గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు ఇంతగా బరితెగిస్తున్నారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. సంక్షోభ సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement