వెలిగొండపై దొంగాట.. | - | Sakshi
Sakshi News home page

వెలిగొండపై దొంగాట..

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

వెలిగొండపై దొంగాట..

వెలిగొండపై దొంగాట..

వెలిగొండపై దొంగాట..

మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందిస్తూ శాశ్వతంగా కరువును నివారించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై పాలకులు దొంగాట ఆడుతున్నారని జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదలశాఖామంత్రి నిమ్మల రామానాయుడు దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న టన్నెల్‌ పనులను మూడు సార్లు పరిశీలించారు. ఈ ఏడాది ఆఖరుకు వెలిగొండ నీరు పారిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే ప్రకటనలు చేశారు. అయితే బడ్జెట్‌ కేటాయింపులో రిక్తహస్తం చూపించారు. ఈ దఫా కేవలం రూ.412.90 కోట్లు మాత్రమే కేటాయించింది. మార్కాపురం జిల్లా ఇచ్చిన ఆనందం వెలిగొండ ప్రాజెక్టు కేటాయించిన నిధులను చూసి ఆవిరైంది. కొత్త జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కూడా ఈ బడ్జెట్‌లో కేటాయించలేదు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉమ్మడి ప్రకాశం ఉండేది. అందులో పశ్చిమ ప్రకాశమే పూర్తిగా వెనుకబడింది. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలతో కలిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధి ఎక్కువగా మార్కాపురం జిల్లాలోనే ఉంది. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వెలిగొండకు అతితక్కువ నిధులు కేటాయించడంపై జిల్లా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు కూడా వెలిగొండకు కేటాయించిన నిధులపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా వెలుగొండకు రూ.492.90 కోట్లు కేటాయించింది. ఇందులో డ్యామ్‌ డెవలప్‌మెంట్స్‌కు రూ.300 కోట్లు, కెనాల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ పనులకు రూ.82.9 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌ లబ్ధిదారులకు రూ.80 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌ వర్కులకు రూ.30 కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రూ.80 కోట్లు ఆర్‌అండ్‌ఆర్‌ వర్కులకు కేటాయించిన నిధులను పక్కన పెడితే రూ.412.90 కోట్లు కేటాయించినట్లు అయింది. కాగా కెనాల్‌ వర్కులకు సంబంధించి రూ.143 కోట్లను 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇదే సమయంలో 1237 ఎకరాల భూమిని 7 నెలల్లో భూసేకరణ కింద తీసుకోవాలని నిర్ణయించారు.

అరకొర నిధులతో ఎప్పటికి పూర్తయ్యేనో..!

బడ్జెట్‌లో నిధులు చూసినట్లయితే ఎలా పూర్తవుతుందో అర్థం కావడంలేదని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మార్కాపురం యూనిట్‌ పరిధిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సుమారు రూ.750 కోట్లు, కంభం యూనిట్‌ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌కు సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతాయని గతంలోనే అంచనా వేశారు. నిజానికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి ఫేజ్‌ పూర్తవడానికి కనీసం రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని స్వయంగా ఇరిగేషన్‌ మంత్రి ఇటీవల ప్రకటించారు. ఆయన చెప్పిన మాట ప్రకారమైన ఈ బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఇటీవల ఫీడర్‌ కెనాల్‌ నిర్మాణానికి రూ.540 కోట్లకు టెండర్లు పిలిచారు. ఇప్పుడు తాజా బడ్జెట్లో కేటాయించిన నిధులు కంట్రాక్టర్‌కు చెల్లించడానికే సరిపోతాయని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. జిల్లాలో మరో కీలకమైన గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కూడా.20 కోట్లు మాత్రమే విదిల్చింది. ఈ కేటాయింపుపై రైతులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నిర్వాసితులకు రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. అందులో కేవలం 10 శాతం కూడా కేటాయించకపోవడాన్ని బట్టి చూస్తే వెలిగొండ ప్రాజెక్టును ఇప్పట్లో పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావించడంలేదని అనుకోవాల్సి ఉంటుందని నిర్వాసితులు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement