గుండ్లకమ్మ
చంద్రబాబు తన బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపారు. ప్రధానంగా సాగు, తాగునీటి రంగానికి అత్తెసరు నిధులు కేటాయించి జిల్లా వాసుల ఆశలపై నీళ్లు జల్లారు. కరువు నేలపై జీవనాడిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టుకు ఎప్పటిలాగే మొక్కుబడిగా నిధులిచ్చి మోసం చేశారు. మరో కీలక ప్రాజెక్టు గుండ్లకమ్మకు సైతం అరకొరగా నిధులు విదిల్చారు. సూపర్ సిక్స్ హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. యువనేస్తం, ఆడబిడ్డ నిధి పథకాలను అటకెక్కించేసింది. కనీస మద్దతు ధర లభించక ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్న అన్నదాతలను డబుల్ ఇంజన్ సర్కార్ రెండేళ్లుగా మోసం చేస్తూనే ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత బడ్జెట్‌లో మిర్చి క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి ఘనంగా ప్రకటించినా అది కనీసం కార్యరూపం దాల్చలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం పద్దులో హార్టీకల్చర్ క్లబ్, అమరావతి క్యాపిటల్ రీజియన్‌ల్లోకి జిల్లాను తీసుకొస్తున్నట్టు మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ప్రకటనపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. ఉత్తుత్తి ప్రకటనలతో సర్కార్ మోసం చేస్తోందని మండిపడుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి అసలు నిధులు కేటాయించకపోవడంపై ఆ ప్రాంత వాసులు పెదవి విరుస్తున్నారు. పీఆర్‌సీ, ఐఆర్‌పై ప్రస్తావన లేకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.


