హెరిటేజ్ పాలలో కల్తీ సంగతేంటి బాబు?
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హెరిటేజ్ డైరీ వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు
ఒంగోలు సిటీ: ‘‘చంద్రబాబు నీ హెరిటేజ్ డైరీలోని పాలలో జరుగుతున్న కల్తీ సంగతి ఏమిటని’’ ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు ప్రశ్నించారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ లడ్డూ విషయాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలని ఎంత ప్రయత్నం చేశారో మనందరికీ తెలుసన్నారు. చంద్రబాబు హెరిటేజ్ బాగోతాలన్నింటినీ ఒక్కొక్కటిగా వెంకటేశ్వరస్వామి బయటకు తీసుకొస్తున్నారన్నారు. ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు అనేదానికి ఇదొక నిదర్శనమన్నారు. లడ్డూలో కల్తీ కలిసిందని చెప్పటం వేరని, పందికొవ్వు, చేప నూనె, జంతువుల కొవ్వు అని పిచ్చిమాటలు మాట్లాడి స్వామి వారిని అపవిత్రం చేయాలని ప్రసాదంపై దుర్మార్గంగా ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. శాఖాహారులు భయపడేటట్లు చేయడం దుర్మార్గమని, దేవుడు నిన్ను క్షమించడన్నారు. 30 ఏళ్ల నుంచి హెరిటేజ్ నడుపుతున్న చంద్రబాబుకి డిటర్జెంట్స్ సోప్ ఆయిల్ ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసని ఎద్దేవా చేశారు. ట్యాంకర్లను క్లీన్ చేయడానికి, పాత్రల జిడ్డును పోగొట్టడానికి కెమికల్ వాడతారన్నారు. లడ్డూ నెయ్యిలో బాత్రూం కెమికల్స్ కలిపారని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. హిందూ మత మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు బోలేబాబా డైరీతో ఉన్న సంబంధాలు బయటకు వస్తున్నాయన్నారు. హెరిటేజ్ పాలలో కల్తీ ఉందని.. హెరిటేజ్ పెరుగు పాలతో తయారు కాలేదని విమర్శించారు. గతంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఒకరిద్దరు ఉండే వారని, ప్రస్తుతం ఒంగోలులోనే ఒక ఆస్పత్రి నడుస్తోందని, మరో రెండు రాబోతున్నాయన్నారు. కల్తీ పాల వల్ల వస్తున్న మార్పుల వల్లనే కేన్సర్ వస్తోందన్నారు. అలాగే పశువులకు ఇస్తున్న దాణాలో కూడా కల్తీ చేస్తున్నారని విమర్శించారు. యూరియాతో తయారైన పాలు ప్రజలకు సరఫరా చేస్తున్న డైరీలతో కేన్సర్ వస్తోందన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు వైవీ.గౌతమ్ అశోక్, పిగిలి శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, సుతారం శ్రీను, చిన్న, అమర్, నాయకులు పాల్గొన్నారు.


