బీచ్ ఫెస్టివల్‌కు పక్కా ఏర్పాట్లు
● అధికారుల సమీక్షలో కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సబర్బన్: సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో చేపట్టనున్న బీచ్ ఫెస్టివల్‌ను ఎలాంటి పొరపాట్లు లేకుండా చేపట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవన్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్‌ను ఛాలెంజ్‌గా తీసుకొని నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విజయవంతం చేయాలని సూచించారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహణలో భాగంగా శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమానికి నోడల్ అధికారిగా జెడ్పీ సీఈఓ చిరంజీవిని నియమించామని వెల్లడించారు. కార్యక్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును ఆదేశించారు. పారిశుధ్యం, మరుగుదొడ్లు నిర్వహణ, తాగునీటి సౌకర్యం, పార్కింగ్ ఏర్పాట్లుపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు వివిధ రకాల సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, హెలికాప్టర్ రైడింగ్, లేజర్ షోలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఓబులేసు, డీపీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


