కుష్టు వ్యాధిని నయం చేయడం సాధ్యమే
ఒంగోలు టౌన్: కుష్టు వ్యాధిని గుర్తించి సరైన వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయడం సాధ్యమేనని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో కుష్టు వ్యాధి నివారణపై పీహెచ్‌సీ, యుపీహెచ్‌సీ వైద్యాధికారులు, లెప్రసీ నోడల్ పర్సన్లకు శిక్షణ నిర్వహించారు. లెప్రసీ, ఏయిడ్స్ , క్షయ జిల్లా అధికారి డాక్టర్ జి.బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ కుష్టు వ్యాధిపై వైద్యాధికారులు, నోడల్ పర్సన్లు సంపూర్ణ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. వ్యాధి నివారణ గురించి నిత్యం అధ్యయనం చేయాలన్నారు. మంచి ఆహారం, సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవాలని సూచించారు. కుష్టు నివారణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ ఆధునిక వైద్యంలో కుష్టు వ్యాధి నివారణకు చాలా మంచి ఔషధాలు ఉన్నాయని చెప్పారు. చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ ఏడుకొండలు కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణకు సంబంధించి సమగ్రంగా విశ్లేషించారు. నెల్లూరు డామియన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ సతీష్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి వల్ల సంభవించే అంగవైకల్యం, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టీహెచ్ వార్డ్ ఎంఓ డాక్టర్ రజిత, పీఎంఓ టి.సూరిబాబు, డీపీఎంఓలు, ఫిజియోథెరపిస్టులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
డాక్టర్ వెంకటేశ్వర్లు


