మెరుగైన వైద్యం అందించాలి
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు అన్నారు. జీజీహెచ్‌లో నెలకొన్న సమస్యలు, సిబ్బంది నియామకంపై సోమవారం పార్టీ నాయకులతో కలిసి స్థానిక కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లా వైద్యశాలను 100 పడకల నుంచి 350 పడకలకు పెంచి జీజీహెచ్‌గా మార్చారన్నారు. అప్పుడు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు 75 మంది వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించడంతో 700 నుంచి 800 మంది ఓపీ పేషంట్లు వైద్య సేవలు పొందారని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఓపీల సంఖ్య 200 నుంచి 250కి పడిపోయిందని, గతంలో 150 ఉన్న ఇన్‌పేషంట్ల సంఖ్య ప్రస్తుతం 40 నుంచి 50కి తగ్గిందంటే జీజీహెచ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, పేద మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో ప్రస్తుతం 9 మంది మాత్రమే వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారని, సెక్యూరిటీగార్డులు, శానిటేషన్ సిబ్బంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ఒక్క జీఓతో సుమారు 53 మంది వైద్య సిబ్బందిని బదిలీ చేయడం అన్యాయమని విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఉన్న జీజీహెచ్‌లోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందకపోవడంపై తాము పోరాడుతుంటే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తమపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు, బురద జల్లుతున్నారని సైటెర్లు వేయడం అన్యాయమన్నారు. మేము సమస్యలపై పోరాడుతుంటే అధికారంలో ఉండి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి మాపై ప్రెస్‌మీట్లు పెట్టి సైటెర్లు వేయడం తగదన్నారు. ఇప్పటికై నా కూటమి నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని, జీజీహెచ్‌లో వైద్య సిబ్బందిని నియమించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారుబాపన్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ సలీమ్, ఏఎంసీ మాజీ చైర్మన్ జి.శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పి.చెంచిరెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, పోరుమామిళ్ల విజయలక్ష్మి, చెన్నలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు అందని సూపర్‌స్పెషాలిటీ వైద్యం
ప్రభుత్వ వైద్యంపై ఎమ్మెల్యే స్పందించాలి
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు


